
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం వీకే ఓపెన్ కాస్ట్‌కు ఎట్టకేలకు ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ వచ్చింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓపెన్ కాస్ట్ ఏర్పాటు కోసం సింగరేణి యాజమాన్యం కొంతకాలంగా కృషి చేస్తోంది. అయితే గతంలో రాష్ట్రంలోని బీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం, సింగరేణి అప్పటి చైర్మన్‌గా సైతం పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఓపెన్ కాస్ట్ విషయంలో జాప్యం జరిగింది. సింగరేణి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న బలరాం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి భట్టి విక్రమార్క సాయంతో ఓపెన్ కాస్ట్ పర్మిషన్ కోసం కృషి చేశారు.
ఏడాదికి 6.3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ఈ ఓసీ పనిచేయనుంది. సుమారు 20 ఏండ్ల పాటు బొగ్గు తవ్వే అవకాశాలు ఉన్నాయి. ఈ ఓపెన్ కాస్ట్‌కు గతంలో పర్మిషన్ రాకపోవడంతో ఇక్కడి కార్మికులను పలు ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రస్తుతం పర్మిషన్ ఓకే కావడంతో కార్మికులంతా తిరిగి కొత్తగూడెం ఏరియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మైన్‌లో జూన్ నుంచి తవ్వకాలు ప్రారంభంకానున్నాయని సమాచారం.