హనుమకొండలోని కొత్త కొండకు రూపు..రూ.75 కోట్లతో పునరుద్ధరణ పనులు

హనుమకొండలోని  కొత్త కొండకు రూపు..రూ.75 కోట్లతో పునరుద్ధరణ పనులు
  • మంత్రి ఆదేశాలతో  ప్రభుత్వానికి ప్రతిపాదనలు 
  • ఇప్పటికే రూ.10 లక్షలతో గుట్టపైకి మెట్ల దారి
  •  రూ.35 లక్షలతో ధ్యాన మందిరం నిర్మాణానికి మంత్రి సొంత నిధులు 

హనుమకొండ, భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ భద్రకాళి వీరభద్రస్వామి ఆలయం డెవలప్‌మెంట్ పనులకు రూ. 75 కోట్లతో ప్రభుత్వానికి ఆఫీసర్లు  ప్రపోజల్స్ పంపించారు.  ఇప్పటికే ఆలయ గుట్టపైకి మెట్లదారి,  ధ్యాన మందిర నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు.  రూ. 10 లక్షలతో మెట్లదారి పనులు జరుగుతుండగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి స్మారకార్థం ఆయన సొంత నిధులు రూ. 35 లక్షలతో ధ్యానమందిర నిర్మాణాన్ని చేపట్టారు. కొత్తకొండ ఆలయానికి ఏటా రూ. 2 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా డెవలప్ మెంట్ విషయంలో వెనకబడిందని భక్తులు ఆరోపిస్తున్నారు. .  

రూ.75 కోట్లతో ప్రతిపాదనలు

హుస్నాబాద్​ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి దక్కించుకున్న పొన్నం ప్రభాకర్​ పలుమార్లు కొత్తకొండ వీరభద్రుడి ఆలయాన్ని సందర్శించారు. ఆఫీసర్లతో చర్చించి ఆలయ అభివృద్ధికి ప్రపోజల్స్​ రెడీ చేయించారు. అక్కడి సమస్యలు, ఇతర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని  రూ.75 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ విషయాన్ని తాజాగా ఆలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రకటించారు.  ప్రతిపాదించిన పనుల్లో ప్రధానంగా కొండపైకి ఘాట్​ రోడ్డు నిర్మాణం, ఐదు అంతస్తుల రాజగోపురం, దక్షిణం, పడమర దిశల్లో 3 అంతస్తుల రాజగోపురం, ప్రసాదాల తయారీకి వంటశాల, కల్యాణ మండపం

ప్రవచనాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్​కు డోమ్​ షెడ్​, క్యూ లైన్ల క్రమబద్దీకరణ, ఆలయం చుట్టూ కాంపౌండ్, లక్ష్మీ గణపతి, హనుమంతుడి గుడికి సాలాహారం, ఎల్కతుర్తి జంక్షన్ వద్ద కొత్తకొండ వైపు నంది శిలావిగ్రహం ఏర్పాటు ఉన్నాయి.  ఆలయ పరిసరాల్లో 20 గదుల షాపింగ్ కాంప్లెక్స్​, ఓపెన్​ డార్మెటరీ హాల్, ఐదు సులభ్​ కాంప్లెక్సులు, మల్లంపల్లి, ముల్కనూర్​ వద్ద ఆర్చీల నిర్మాణం, టెంపుల్​ చుట్టూ సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, చైర్మన్​, ఈవో ఛాంబర్లు, వీఐపీ సూట్​ గదుల కన్​ స్ట్రక్షన్​, టెంపుల్​ వద్ద బస్టాండ్ నిర్మాణం.. ఇలా తదితర 26 పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. తొందర్లోనే ప్రభుత్వం నుంచి గ్రీన్​ సిగ్నల్​ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

అక్రమ నిర్మాణాలపై యాక్షన్​ తీసుకోవాలనే డిమాండ్

ఏటా వీరభద్రస్వామి ఆలయంలో సంక్రాంతి సమయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.  జాతర సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా ఫోకస్​ పెట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.  గుడి చుట్టూ ఉన్నవన్నీ ఏక్​ ఫసల్​ భూములు కాగా..  ఒక సీజన్​ పంట కోసం, మరో సీజన్​ జాతర కోసం భూములు వదలాల్సి ఉంది. కానీ ఏక్​ ఫసల్​ భూముల్లో కొంతమంది అడ్డదారుల్లో పంచాయతీ నుంచి పర్మిషన్లు తీసుకుని అక్రమంగా బిల్డింగులు కట్టారు.  దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ఎడ్ల బండ్లు, వాహనాలు

సర్కస్​ లు, రంగుల రాట్నాలు, వివిధ చిరు దుకాణాలకు జాగ లేక జాతర కళ తప్పుతోంది. దీంతోనే జాతర నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతుండగా..  ఆలయ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపైనా యాక్షన్​ తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.