వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా కొత్తకోట గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పంచాయతీ ఇంటర్ బోర్డు వద్దకు చేరింది. ఇక్కడ కొంత కాలంగా ప్రిన్సిపాల్, కాంట్రాక్టర్ లెక్చరర్ల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలండర్‌ను పాటించాలని డిమాండ్ చేసిన స్టూడెంట్లకు కొందరు లెక్చరర్లు మద్దతుగా నిలవడంతో ప్రిన్సిపాల్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. అకడమిక్ ఇయర్ మధ్యలోనే ఐదుగురు కాంట్రాక్ట్ లెక్చరర్లను ట్రాన్స్‌ఫర్ చేయించారు. దీంతో స్టూడెంట్లు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, డీఐఈవో జాకీర్ హుస్సేన్, జిల్లా ఎస్పీ అపూర్వరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్జేడీ ఓబిలి రాణి, డీఐఈవో జాకీర్ హుస్సేన్ కాలేజీని విజిట్ చేసినా సమస్యలను పరిష్కరించలేదు. దీంతో గురువారం పలు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి స్టూడెంట్లు గురువారం ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్‌ను కలిశారు. ప్రిన్సిపాల్ హైమావతిని తొలగించి తమకు లెక్చరర్లను నియమించాలని కోరారు.
కొన్నేళ్లుగా ఇదే తంతు
కాలేజీలో కొన్నేళ్లుగా ప్రిన్సిపాల్, కాంట్రాక్ట్ లెక్చరర్ల మధ్య తగాదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల్లో కలిపి 230 స్టూడెంట్లు ఉండగా.. ప్రిన్సిపాల్, ఇద్దరు రెగ్యులర్, ఐదుగురు కాంట్రాక్ట్, ముగ్గురు గెస్ట్ లెక్చరర్లు, మరో ముగ్గురు నాన్ టీచింగ్ స్టాప్ పనిచేస్తున్నారు. ప్రిన్సిపాల్ హైమావతి తనకు అనుకూలంగా ఉండే లెక్చరర్లు కాలేజీకి సక్రమంగా రాకపోయినా సంతకాలు పెట్టించి పుల్ జీతం ఇస్తున్నారు. మిగిలిన లెక్చరర్లు కొంచెం లేట్‌గా వచ్చినా సీఎల్ వేస్తుండడంతో లెక్చరర్లు వర్గాలుగా విడిపోయారు. పైగా వీరిలో ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడని ఫిర్యాదులు రావడంతో 2019లో ఆర్జేడీ జయప్రద విచారణ చేపట్టారు. అయితే ఆ లెక్చరర్‌కు ప్రిన్సిపాల్ అండగా ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇష్యూ బయటికి లీక్ కావడంతో మరో వర్గం పనేనని అనుమానించిన ప్రిన్సిపాల్ వారిని ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశారు.
స్టూడెంట్లకు మద్దతివ్వడంతోనే..
తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల లెక్చరర్లు ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లను ఒకే దగ్గర కూర్చోబెట్టి మొక్కుబడిగా పాఠాలు చెబుతుండడంతో కొందరు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటర్ బోర్డు జారీచేసిన అకడమిక్ టైంటేబుల్ అమలు చేయాలని కోరారు. అయినా, ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో వనపర్తి జిల్లా కలెక్టర్ , డీఐఈవోలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన స్టూడెంట్లకు కొందరు లెక్చరర్లు సపోర్ట్‌గా ఉండడంతో ప్రిన్సిపాల్‌తో పాటు ఆమె వర్గం లెక్చరర్లు టార్గెట్ చేశారు.
మొక్కుబడిగా విచారణ...
స్టూడెంట్ల ఫిర్యాదుతో డీఐఈవో జాకీర్ హుస్సేన్ విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలువురు స్టూడెంట్ ప్రిన్సిపాల్ వ్యవహర శైలి కారణంగా స్టూడెంట్లకు క్లాసులు జరగడం లేదని డీఐఈవో దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కొందరు లెక్చరర్లు తమసై ఫిర్యాదు చేస్తారా..? అని స్టూడెంట్లను తిట్టడంతో పాటు వారి ఇళ్లకు వెళ్లి పేరెంట్స్‌కు తప్పుడు విషయాలు చెప్పారు. దీంతో స్టూడెంట్లు ఎస్పీ అపూర్వరావు, ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సారి ఇంటర్ బోర్డు నుంచి ఆర్జేడీ ఓబిలిరాణి కాలేజీకి విచారణకు వచ్చారు. కానీ, చర్యలు మాత్రం తీసుకోలేదు.
ఐదుగురు కాంట్రాక్ట్ లెక్చరర్లు బదిలీ
ఆర్జేడీ ఓబిలిరాణి పనిష్మెంట్ పేరిట ఐదుగురు కాంట్రాక్ట్ లెక్చరర్లను వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ ఈ నెల 7 న ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇందులో ప్రిన్సిపాల్ వర్గం వారిని సొంత జిల్లాలు, మండలాలకు, ఇతర లెక్చరర్లు వేరే జిల్లాలకు ట్రాన్స్ పర్లు చేయడంతో ఇష్యూ మరింత ముదిరిపోయింది. ప్రిన్సిపాల్ హైమావతీ ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అండతో డీఐఈవో,ఆర్జేడీలను మేనేజ్ చేసి ట్రాన్స్‌ఫర్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
బదిలీల రద్దు కోసం బేరసారాలు!
లెక్చరర్లు ట్రాన్స్‌పర్లను రద్దు చేసి వనపర్తి జిల్లాలోనే తిరిగి పోస్టింగులు ఇప్పిస్తామని ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి వర్గానికి చెందిన ఓ లెక్చరర్ మధ్యవర్తిగా బేరసారాలకు దిగినట్లు తెలిసింది. చైర్మన్‌కు రూ. 4 లక్షలు ఇస్తే ఇంటర్ బోర్డులో మేనేజ్ చేసి ఆర్డర్లు ఇప్పిస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ ఇష్యూపై ఇంకో యూనియన్ నాయకుడు మాచర్ల రామకృష్ణ గౌడ్ వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టడం సంచలనం గా మారింది