
- ఉప్పల మల్యాలలో 50.19 ఎకరాల భూసేకరణ కొలిక్కి
- 5 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూట్ క్లియర్
- భూసేకరణకు ఓకే చెప్పిన రైతులు, ఇండ్ల యజమానులు
కరీంనగర్, వెలుగు: కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ లో మరో ముందడుగుపడింది. కొత్తపల్లి -– వేములవాడ మధ్య 5 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూట్ క్లియర్ అయింది. గంగాధర మండలం ఉప్పల మల్యాల రెవెన్యూ విలేజీ పరిధిలోని ఉప్పల మల్యాల, రంగారావుపల్లెలో 50.19 ఎకరాల భూసేకరణ కొలిక్కి వచ్చింది. ఈ రూట్ లో వచ్చే 23 ఇండ్లను, భూములను రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకోగా.. త్వరగా ట్రాక్ నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదు.
ఎకరాకు రూ.20.25 లక్షలు
151 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న ఈ రైల్వే లైన్ లో ఇప్పటి వరకు 79 కిలోమీటర్ల మేర ట్రాక్ పూర్తయింది. సిద్ధిపేట నుంచి మనోహరాబాద్ మీదుగా సికింద్రాబాద్ వరకు రైళ్లు నడుస్తున్నాయి. సిద్ధిపేట నుంచి సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి జంక్షన్ కు కలిపేలా ట్రాక్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు కల్వర్టులు, వంతెనలు, ఆర్వోబీల్లాంటి రైల్వేలైన్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. సిరిసిల్ల నుంచి వేములవాడ రూట్ లో లక్ష్మీపురం నుంచి చింతల్ రాణా సమీపంలోని బోడగుట్ట వరకు భూసేకరణ పూర్తికాగా ట్రాక్ నిర్మాణ పనులకు రూ.224 కోట్లు కేటాయించారు.
వేములవాడ మీదుగా వచ్చే రైల్వే లైన్ ను గంగాధర మధ్యలోని కొత్తపల్లి ట్రాక్ కు అనుసంధానిస్తారు. సేకరించిన 50.19 ఎకరాల భూమి, 23 ఇండ్లను, ఇంటి స్థలాలను సేకరిస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.15 లక్షలు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదించారు. అయితే.. పరిహారం మరింత పెంచాలనే తమ డిమాండ్ రీఅసెస్మెంట్ కు ప్రయత్నిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు తెలిపారు. వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.20.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారని పేర్కొన్నారు.
ఐదుసార్లు భూమిని పోగొట్టుకున్నాం
ఇప్పటికీ ఐదు సార్లు మా భూమిని పోగొట్టుకున్నాం. లోయర్ మానేర్ డ్యామ్ లో మా తాత కొమురయ్యకు చెందిన12 ఎకరాల భూమి ముంపునకు గురైంది. దీంతో రంగారావుపల్లికి వలసవెళ్లాం. వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం వరద కాల్వ నిర్మాణంలో నాలుగెకరాలు, నలుగురి ఇండ్లు ముంపులో పోయాయి. ఆ తర్వాత చేపట్టిన డి–4 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లో ఎకరం భూమిని కోల్పోయాం.
వరద కాల్వకు అనుసంధానంగా చేపట్టిన1.1 టీఎంసీ అదనపు కాల్వ నిర్మాణంలో ఐదెకరాల భూమి పోయింది. ఇప్పుడు కొత్తపల్లి – -మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణంలో మా కుటుంబాలకు చెందిన 5 ఇండ్లను కోల్పోతున్నాం.- పాశం కుమార్ యాదవ్, రంగారావుపల్లి