గిరిజన గురుకుల స్కూల్లో పురుగుల బియ్యంతో అన్నం..కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు..

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సన్నబియ్యంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని తెలంగాణ సర్కారు గొప్పలు చెప్తుండగా..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం అవన్నీ గప్పాలని అర్థమవుతున్నాయి. సీఎం మనవడు హైదరాబాద్లో ఏం బువ్వ తింటున్నాడో..గురుకుల పాఠశాలల్లో చదవే విద్యార్థులకు కూడా అదే ఆహారం పెడుతున్నామని సీఎం కేసీఆర్ సహా మంత్రులు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ ఉట్టి మాటలని.. తమకు నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు.  మెనూలో ఓ విధంగా ఉంటే..పెట్టేది మరో ఆహారం..అది కూడా చెత్తగా  ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పురుగుల బియ్యం..ఆధ్వాన్నమైన భోజనం..

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కొత్తపల్లి గ్రామం నుంచి చౌడాపూర్ వరకు 7 కిలోమీటర్లు నడుచుకుంటూ నిరసన తెలిపారు. తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని.. అడిగితే హాస్టల్ వార్డెన్ ఇస్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వార్డెన్ ను తొలగించాని డిమాండ్ చేస్తున్నారు.  చౌడాపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు బైటాయించారు.  కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు వండుతున్నారని విమర్శించారు. 

ALSO READ: సింహాచలం గిరి ప్రదక్షిణ.... అప్పన్న ఆలయం చుట్టూ భక్తజన సందోహం

రూ. 36 లో ఇంతే భోజనం..

తమ గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఆహారం మెనూ  ప్రకారం ఎందుకు ఇవ్వడం లేదని వార్డన్ ను ప్రశ్నిస్తే ...మీకు ఇచ్చే 36 రూపాల్లో ఇంతే  పెడతామంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉంటే ఉండండి లేదంటే టీసీ  తీసుకొని వెళ్ళి పోండని బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు. మెనూలో ఉన్న ప్రకారం పెట్టడం లేదని.. ఒక భోజనం ఉంటే  మరో భోజనాన్ని కట్ చేస్తున్నారని మండిపడ్డారు.