కొమురవెల్లి మల్లన్నకు కోటొక్క దండాలు

కొమురవెల్లి మల్లన్నకు కోటొక్క దండాలు
  • లష్కర్​ వారానికి పోటెత్తిన భక్తజనం

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.  స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారానికి (లష్కర్ వారం) భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు మల్లన్న కోనేరులో స్నానమాచరించి మట్టికుండల్లో నైవేద్యం వండి డప్పుచప్పుళ్ల మధ్య స్వామివారికి బోనాలు సమర్పించారు.

అనంతరం గంగిరేగు చెట్టువద్ద పట్నాలు వేసి మల్లన్నకు మొక్కులు అప్పజెప్పారు. తర్వాత మల్లన్నగుట్టపై  వెలసిన రేణుకఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాల్లోని గంగిరేగు చెట్టు, రాజగోపురం, రాతిగీరలు, కోడెల స్తంభం, తోటబావి, ఎల్లమ్మ కమాన్, బస్టాండ్, సినిమా టాకీస్ ప్రాంగణం, రాంసాగర్ రోడ్డులోని కుర్మసంఘం వరకు ఖాళీ స్థలాలు భక్తుల విడిదితో పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి  6 నుంచి 7 గంటల సమయం పడుతోంది.