బొగ్గు ఉత్పత్తికి ఆపసోపాలు .. టార్గెట్ కు దూరంగా కొత్తగూడెం పీవీకే–5 మైన్

  • డెయిలీ1300 గాను 700 టన్నులే ఉత్పత్తి
  •  250 నుంచి 300 మంది కార్మికులు గైర్హాజరు
  • ముందుకు సాగని మ్యాన్​రైడింగ్, టన్నెల్​పనులు 
  • యూజీ పనులకు ఇంట్రస్ట్​చూపించని కార్మికులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కంపెనీ హెడ్డాఫీస్​సమీపంలో ఉన్న కొత్తగూడెం పీవీకే–5 ఇంక్లైన్ మైన్ బొగ్గు ఉత్పత్తి టార్గెట్​కు దూరంగా ఉంటోంది. డెయిలీ 1300 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 700 టన్నులకు మించి తీయడం లేదు. సరిపడా మ్యాన్​పవర్​లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక్కడ దాదాపు 700 మంది కార్మికులు పనిచేస్తుండగా, యాజమాన్యం వారిలోని150 మందిని డిప్యుటేషన్​పై వేర్వేరు ప్రాంతాలకు పంపించింది. 250 నుంచి 350 మంది నిత్యం విధులకు గైర్హాజరు అవుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా 24 అండర్ గ్రౌండ్ మైన్లు ఉండగా, కొత్తగూడెం పీవీకే–5 యూజీ మైన్18 లేదా19 స్థానంలో కొనసాగుతోంది. 

రూ.21 కోట్లతో చేపట్టిన మ్యాన్ రైడింగ్, టన్నెల్​పనులు పూర్తికాకపోవడంతో కార్మికులు రోజూ డ్యూటీలకు వెళ్లేటప్పుడు 2 కిలోమీటర్లు, తిరిగొచ్చేటప్పుడు 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. దీంతో యూనియన్​నేతల అండతో కొందరు కార్మికులు డిప్యూటేషన్లపై సర్ఫేస్, ఇతరత్రా ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం, సగం మంది కార్మికులే డ్యూటీలకు హాజరవుతుండడంతో పీవీకే-–5 మైన్ లో బొగ్గు ఉత్పత్తి సగానికి పడిపోయింది. 

సగం తవ్వి మమ..

గత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ 4 లక్షల టన్నుల బొగ్గు తవ్వాల్సి ఉండగా 2.2 లక్షల టన్నులు తీసి మమ అనిపించారు. బొగ్గు బావిలోకి దిగిన తర్వాత పని ప్రదేశానికి వెళ్లాలంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. డ్యూటీ అయిపోయాక మళ్లీ రెండు కిలోమీటర్లు నడిస్తేనే పైకి వెళ్లే లిఫ్ట్(కేజీ) వస్తుందంటున్నారు. గతేడాది నడక భారాన్ని తగ్గించేందుకు రూ.9 కోట్లతో మ్యాన్​ రైడింగ్​ఏర్పాటు చేస్తామని యాజమాన్యం చెప్పడంతో కార్మికులు ఆనందపడ్డారు. కానీ ఆ పనులు చాలా స్లోగా సాగుతుండడంతో కార్మికులకు నిత్యం నడిచి వెళ్లక తప్పడం లేదు. ఏప్రిల్, మే నెలలోపు పనులు పూర్తి చేయాలని టార్గెట్​పెట్టుకున్నా పెద్దగా పురోగతి లేదు. 

మరో వైపు తవ్విన బొగ్గును బయటకు బెల్ట్​ద్వారా పంపించడంతోపాటు మైన్​లోపలి వస్తు సామగ్రిని హాలేజీ ద్వారా బయటకు తీసుకువచ్చేందుకు రూ.12 కోట్లతో టన్నెల్​ఏర్పాటు చేయాలని యాజమాన్యం 2015లో పనులను చేపట్టింది. 2018 నాటికి పనులు పూర్తికావాల్సి ఉంది. కానీ నేటికీ ఆ పనులు కాలేదు. కొంత ఫారెస్ట్​ క్లియరెన్స్ రాలేదని అధికారులు చెబుతున్నారు. పని ప్రదేశాల్లో వెంటిలేషన్ లేక నానా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు. రూఫ్​నుంచి హాట్​వాటర్​పడుతోందని చెబుతున్నారు.

యాజమాన్యం ఆదేశాలతోనే డిప్యుటేషన్లు

బొగ్గు ఉత్పత్తి టార్గెట్​సాధించేందుకు కృషి చేస్తున్నాం. కంపెనీ అవసరాల మేరకు డిప్యూటేషన్లు చేస్తున్నాం. కార్మికుల గైర్హాజరు ఎక్కువగా ఉంటోంది. సరిపడా కార్మికులు పనికి రాకపోవడంతో మ్యాన్ రైడింగ్​పనులు కొంత స్లోగా నడుస్తున్నాయి. టన్నెల్ పనులు కొనసాగుతున్నాయి. కొంత మేర ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. దాంతో సర్ఫేస్​లో పనులు ఆగాయి. 

- పాలడుగు శ్రీనివాస్, మేనేజర్, పీవీకే–5 ఇంక్లైన్, కొత్తగూడెం ఏరియా