నారాయణపేటలో ప్రజా పాలనను పక్కాగా నిర్వహించాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేటలో ప్రజా పాలనను పక్కాగా నిర్వహించాలి  : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: ప్రజా పాలన కార్యక్రమాన్ని జిల్లాలో పక్కాగా నిర్వహించాలని నారాయణపేట కలెక్టర్  కోయ శ్రీహర్ష  ఆదేశించారు. ప్రజా పాలన నిర్వహణపై అధికారులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్  గార్డెన్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

 సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న  కొడంగల్  నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు, గుండుమల్, కొత్త పల్లి మండలాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని మొదటి రోజు చేపట్టేందుకు మండల స్పెషల్ ఆఫీసర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు  స్వీకరించాలని తెలిపారు. ఇంటికి ఒకే దరఖాస్తు తీసుకొని, ఈ పథకాల కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్  కాపీలను అందజేయాలని సూచించారు. డీఏవో జాన్ సుధాకర్, డీపీవో మురళి పాల్గొన్నారు.

వనపర్తి: జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని వనపర్తి కలెక్టర్  తేజస్ నందలాల్ పవార్  అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ప్రజాపాలన కార్యక్రమంపై జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్  కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను తీసుకోవాలని సూచించారు.  నియోజకవర్గంతో పాటు మండలానికో స్పెషల్​ ఆఫీసర్​ను నియమిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్.తిరుపతి రావు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ కలెక్టరేట్: ప్రజాపాలన కార్యక్రమాన్ని సక్సెస్  చేయాలని అడిషనల్  కలెక్టర్లు  శివేంద్ర ప్రతాప్, ఎస్.మోహన్ రావు సూచించారు.  మంగళవారం కలెక్టరేట్ లో ప్రజా పాలన కార్యక్రమంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజా పాలన నిర్వహణపై ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. షెడ్యూల్  ప్రకారం గ్రామాలు, వార్డులకు వెళ్లాలని సూచించారు. నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. డీఆర్డీవో యాదయ్య, ఏఎస్పీ  రాములు, జడ్పీ సీఈవో జ్యోతి పాల్గొన్నారు.

గద్వాల: ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆఫీసర్లంతా కలిసికట్టుగా సక్సెస్  చేయాలని అడిషనల్  కలెక్టర్లు శ్రీనివాసులు,అపూర్వ్ చౌహాన్  కోరారు. కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో ప్రజా పాలన కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ప్రణాళికపై అడిషనల్  ఎస్పీ రవితో కలిసి మీటింగ్ నిర్వహించారు. ఆఫీసర్లు కో ఆర్డినేషన్​ చేసుకుంటూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లపై ప్రజలకు అవేర్నెస్  కల్పించాలని సూచించారు. జడ్పీ సీఈవో కాంతమ్మ, సుబ్రమణ్యం పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్: ఆరు గ్యారంటీల అమలు కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని అడిషనల్​ కలెక్టర్  కుమార్  దీపక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌  ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎల్పీవోలు, మున్సిపల్‌‌‌‌‌‌‌‌  కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. డీపీవో కృష్ణ, డీఆర్డీవో నర్సింగరావు, స్పెషల్  డిప్యూటీ కలెక్టర్  రాంరెడ్డి, కలెక్టరేట్  ఏవో చంద్రశేఖర్  పాల్గొన్నారు.