ఖరీదైన ఫోన్లంటే ఎవరికైనా ఇష్టమే.. ఇష్టపడిన ఫోన్ అంటే దానికి ఎంత డబ్బైనా పెట్టి కొంటారు.. కానీ కొందరు వాటికోసం అడ్డదారులు తొక్కుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ దొంగ మొబైల్ షోరూంలో చోరీకి పాల్పడ్డాడు. అర్థరాత్రి షోరూం తాళాలు పగులగొట్టి.. విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లాడు. ఆగస్టు 12 శనివారం రాత్రి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్‌నంబర్ వన్‌లోని హాజిల్ మొబైల్ షోరూంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగుడు ముఖానికి మాస్క్ ధరించి.. రాత్రివేళ షోరూం తాళాలు పగులగొట్టి దొంగతానికి పాల్పడ్డాడు. ఖరీదైన 18 యాపిల్ ఐ ఫోన్లు, 2 శాంసంగ్ ఫోన్లను చోరీ చేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే చోరీకి గురైన సెల్ ఫోన్ల విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటాయని షోరూం నిర్వాహకులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.