వర్ధన్నపేట, వెలుగు : ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు చెప్పారు. డబ్బు, మద్యం పంచకపోయినా తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ప్రమాణస్వీకారం తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన ఆయన ముందుగా ఐనవోలు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు ఉచిత బస్సు రవాణాను ప్రారంభించారు.
తర్వాత అక్కడి నుంచి వర్ధన్నపేట ఫిరంగిగడ్డ వరకు ర్యాలీ నిర్వహించి, హాస్పిటల్‌లో రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేశామని, మిగతా వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ రాజయ్య, నాయకులు నమిండ్ల శ్రీనివాస్, బొంపల్లి దేవేందర్‌రావు, సమ్మెట సుధీర్, అబ్బిడి రాజిరెడ్డి పాల్గొన్నారు.