- ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని సూచించారంటూ వార్తా కథనాలు
- తప్పుడు ప్రచారమన్న రష్యా క్లారిటీ
వాషింగ్టన్: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారని, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంపై చర్చించారని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌ను ట్రంప్ కోరినట్లు సమాచారం. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై ఇద్దరూ ఫోన్‌లో చర్చించినట్లు కథనాలు ప్రసారం అయ్యాయి. పోయిన గురువారం ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ నుంచి ట్రంప్.. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు వాషింగ్టన్ పోస్ట్ కూడా కథనం ప్రచురించింది.
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగించొద్దు. శాంతి స్థాపనకు కృషి చేయండి. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో త్వరలోనే ఓ పరిష్కార మార్గం కనుగొందాం. ఐరోపాలో అమెరికన్ మిలటరీ మోహరించి ఉన్నది’’ అని పుతిన్‌తో ట్రంప్ అన్నట్లు తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కలగజేసుకోవడం ట్రంప్‌కు ఇష్టం లేదని అమెరికాకు చెందిన ఓ మాజీ అధికారి తెలిపారు. శాంతి స్థాపన దిశగానే ట్రంప్ అడుగులు వేస్తున్నారని చెప్పారు.
ఇప్పటికైతే చర్చలపై ఎలాంటి ప్రణాళికల్లేవు..
పుతిన్‌తో ట్రంప్ అసలు మాట్లాడలేదని రష్యా స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కొట్టిపారేశారు. ‘‘వెస్ట్రన్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదు. పేరున్న మీడియా సంస్థలు కూడా తప్పుడు వార్తలు ప్రసారం చేయడం బాధాకరం. పుతిన్, ట్రంప్ అసలు మాట్లాడుకోలేదు. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య చర్చలకు సంబంధించిన ఎలాంటి ప్రణాళికలు లేవు’’ అని తెలిపారు.