- మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు ఉచిత శిక్షణ
- సేంద్రీయ సాగుపై సైంటిస్టులతో అవగాహన
మెదక్, కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం సేంద్రీయ సాగుపై సైంటిస్టులతో రైతులకు అవగాహన కల్పిస్తూ పంట సాగులో లాభాల బాట పట్టిస్తోంది.కౌడిపల్లి మండలం తునికి గ్రామ సమీపంలోని ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా రైతులకు ట్రైనింగ్ ఇస్తోంది. ఆర్గానిక్ ఫార్మింగ్‌పై అవేర్ నెస్ కల్పిస్తోంది. ఫ్రీగా నాణ్యమైన పంట విత్తనాలు అందిస్తోంది. దీంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి మంచి ఇన్ కం పొందేలా రైతులకు సాయపడుతోంది.
దివంగత సినీ ప్రొడ్యూసర్ డాక్టర్ డి.రామానాయుడు తునికి గ్రామ శివారులో 30 ఎకరాల విస్తీర్ణంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆర్థిక సహకారంతో 2018లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవీకేను సేంద్రీయ వ్యవసాయ ప్రయోగశాలగా తీర్చిదిద్దారు. ఇందులో పంటల సాగుకు సంబంధించిన వివిధ అంశాలపై అగ్రికల్చర్ సైంటిస్ట్‌లు ప్రయోగాలు చేస్తుంటారు. సాయిల్ టెస్ట్ ప్రాధాన్యాన్ని రైతులకు వివరించి, భూసార పరీక్షల ఆధారంగా ఏ నేలలు ఏ రకమైన పంటల సాగుకు అనుకూలమో, భూసారాన్ని పెంచేందుకు ఏమిచేయాలో వివరిస్తారు.
అందుబాటులో ఐదుగురు సైంటిస్టులు
కేవీకేలో ఐదుగురు అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్ట్రవికుమార్ సాయిల్ టెస్ట్‌ల ద్వారా ఏ నేల ఏ రకమైన పంట సాగుకు అనుకూలమో తెలియజేయడంతోపాటు, ఎరువుల యాజమాన్యం, మొక్కల సంరక్షణ, తెగుళ్ల నివారణ గురించి రైతులకు అవగాహన కలిగిస్తారు. హార్టికల్చర్ సైంటిస్ట్ శ్రీనివాస్ కూరగాయలు, పూలతోటల సాగు, ఉదయ్ కుమార్ పంటల సాగుతో వివిధ యంత్రాల ఉపయోగం గురించి వివరిస్తారు. గృహ విజ్ఞాన శాస్త్రం గురించి సైంటిస్ట్ భార్గవితో పాటు, విస్తరణ విభాగ శాస్త్రవేత్త శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు.
గోశాల ఏర్పాటు చేసి ఆవులను పెంచుతూ గోమూత్రం, పేడతో జీవామృతం, పంచగవ్య, ఘన జీవామృతం, వర్మీ కంపోస్ట్ తయారుచేసి ఆర్గానిక్, నేచర్ ఫార్మింగ్ పద్ధతిలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. హైదరాబాద్ లోని అగ్రి బయోటెక్ నర్సరీ నుంచి రెడ్ అలోవెరా మొక్కలు తీసుకువచ్చి ఎకరం విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. లెమన్ గ్రాస్, వాము సాగు చేస్తూ వాటి ద్వారా సబ్బులు తయారు చేస్తుండటంతోపాటు, మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. తద్వారా వారి ఆర్థికాభ్యున్నతికి బాటలు వేస్తున్నారు.
Also Read :- రెవెన్యూ డివిజన్లపై ఆశలు
సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు ప్రత్యక్షంగా అవగాహన కలిగించేందుకు కేవీకేలో పసుపు, కంది, పెసర, చెరుకు పంటలతో పాటు, వివిధ రకాల కూరగాయలను, బొప్పాయిని సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. సేంద్రియ సాగు వల్ల కలిగే లాభాలను వివరించేందుకు మాడల్ నర్సరీలను ఏర్పాటు చేశారు. కేవీకేలో రూ.55 లక్షలతో జీవ నియంత్రణ ప్రయోగశాల ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూడు వేల మంది రైతులకు 18 వేల లీటర్లు జీవన ఎరువులు విక్రయించారు.
తునికి ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రాన్ని హరియాణ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించి రైతులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. కేవీకే సైంటిస్టులు పంటల సాగులో ప్రయోగాలు చేస్తూ, రైతులకు మేలు కలిగేలా సేంద్రీయ పద్ధతిని ఎంకరైజ్ చేయడాన్నిఅభినందించారు.
తునికి ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంజాతీయ స్థాయిలో ఆరు బెస్ట్ అవార్డులు సాధించింది. వ్యవసాయంలో రైతులు నూతన సాంకేతిక పద్ధతులు అవలంబించేలా కృషి చేయడం, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు విరివిగా చేపట్టడం, రైతుల సమాచార నమోదు, శిక్షణ విషయంలో ఆదర్శంగా నిలిచినందుకు అవార్డులు లభించాయి.
సేంద్రియ వ్యవసాయంతో అనేక లాభాలు
పంట సాగు పెట్టుబడి వ్యయం తగ్గి, ఆశించిన దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే మా లక్ష్యం. ఇందుకు అనుగుణంగా కేవీకే ద్వారా ఆధునిక పద్ధతులు, ప్రధానంగా సేంద్రియ సాగు విధానాలపై వారికి అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు సాగులో ట్రైనింగ్ ఇస్తున్నాం. - నల్కర్, కేవీకే సీనియర్ సైంటిస్ట్