- రెండు వారాల బ్రేక్ తరువాత రెండోసారి తెలంగాణ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో
- కర్నాటక నుంచి తెలంగాణ వరకు ప్రాజెక్టులన్నీ ఫుల్
- నిండుకుండలా నాగార్జునసాగర్
మహబూబ్‌నగర్, వెలుగు: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతోంది. రెండు వారాల వ్యవధిలోనే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఈ ఏడాది రెండోసారి పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్లో నమోదు అవుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ ఫుల్కెపాసిటీకి చేరుకోగా.. జులై మూడో వారం నుంచి ఇప్పటి వరకు ఎగువ ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు దాదాపు 800 టీఎంసీల నీరు వరద రూపంలో వచ్చినట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెక్కలు చెబుతున్నాయి.
రెండు వారాల బ్రేక్ తరువాత..
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు జూన్ రెండో వారం నుంచి వరద మొదలవుతుంది. కానీ, ఈ ఏడాది జూన్‌లో వానలు పడలేదు. జులై రెండో వారం నుంచి వానలు మొదలు కావడం.. ఇదే సమయంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడంతో అక్కడి ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర (టీబీ డ్యామ్) ప్రాజెక్టులు ఫుల్కెపాసిటికీ చేరాయి. దీంతో జులై 17 నుంచి తెలంగాణలోని కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రారంభమైంది. 27 రోజుల పాటు కర్నాటక ప్రాజెక్టుల నుంచి ఇన్ ఫ్లో నమోదు కాగా.. వర్షాలు తగ్గడంతో ఈ నెల 12 నుంచి అక్కడి ప్రాజెక్టుల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా బంద్అయింది.
Also Read:-వ్యవసాయానికి ‘డ్రోన్’ సాయం.. ఐనవోలులో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
అప్పటి వరకు లక్ష క్యూసెక్కుల నుంచి నాలుగున్నర క్యూసెక్కుల వరకు నమోదు అయిన ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కుల నుంచి 20 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఆల్మట్టి, నారాయణపూర్, టీబీ డ్యామ్గేట్లు బంద్చేయగా.. కేవలం పవర్ జనరేషన్ ద్వారా వచ్చిన నీటినే దిగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు చేరుతోంది. అయితే, అల్పపీడన ప్రభావంతో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో వరద వస్తోంది.
ఇప్పటికే అవి ఫుల్ కెపాసిటీలో ఉండగా.. వచ్చిన వరదను వచ్చింది వచ్చినట్లుగా కిందికి వదులుతున్నారు. దీంతో రెండు వారాలు తిరగక ముందే కర్నాటక ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు మళ్లీ వరద మొదలైంది. గత సోమవారం నుంచి అక్కడి ప్రాజెక్టుల ద్వారా లక్ష క్యూసెక్కుల మేర వరద వస్తుండగా.. ఇది మంగళవారం సాయంత్రం నాటికి 2.10 లక్షలకు చేరింది. ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటుండగా.. వరద మరో వారం పాటు కొనసాగే అవకాశం ఉంది.
డెడ్ స్టోరేజీ నుంచి ఫుల్ కెపాసిటీకి..
గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో నమోదు కాలేదు. ఇటీవల ఎండా కాలంలో ఈ ప్రాజెక్టుల కింద సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉన్న కొద్దిపాటి నిల్వలను కేవలం తాగునీటికే వినియోగించారు. జులై నాటికి అన్ని ప్రాజెక్టులకు డెడ్ స్టోరేజీకి చేరాయి. ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైనప్పటి నుంచి జూరాలలో 5.10 టీఎంసీలు, శ్రీశైలంలో 33.9 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 12టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నాయి.
అయితే వరద వచ్చిన వారం రోజుల్లోనే ఇవి నిండాయి. శ్రీశైలంకు గత నెల 19వ వరద ప్రారంభం కాగా.. 28 నాటికి ఫుల్ కేపాసిటీకి చేరుకుంది. సాగర్‌కు 29 నుంచి ఫ్లడ్ రాగా.. ఈ నెల 5 నాటికి ఫుల్ కెపాసిటీకి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 800 టీఎంసీల వరద రాగా, ఇందులో 446 టీఎంసీలు ప్రాజెక్టులను నింపుకోవడానికి సరిపోయింది. మిగతా జలాలను దిగువకు వదిలారు.
చెరువులు నింపుకునే అవకాశం
జూరాల, శ్రీశైలం పరిధిలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఎంజీకేఎల్ఐ స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్సెస్ వర్షం నమోదైనా.. ఇంత వరకు చెరువులు నిండలేదు. 1,265 చెరువులు ఉండగా, వర్షాకాలం ముగుస్తున్నా సగం చెరువులకు నీరే చేరలేదు. అయితే లిఫ్ట్ కెనాల్స్ ద్వారా చెరువులను నింపాల్సి ఉంది. రెండేండ్ల కింద ప్రాజెక్టులకు వరద ప్రారంభమైతే.. మొదట నీటిని లిఫ్ట్‌లకు ఎత్తిపోసి అక్కడి నుంచి కెనాల్స్ ద్వారా చెరువులకు నీటిని తరలించేలా ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేసేవారు. ఈ ఏడాది వరదలు వస్తున్నా ఇప్పటి వరకు చెరువులు నింపేందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి
ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ ప్రస్తుతం
(టీఎంసీల్లో) (టీఎంసీల్లో)
ఆల్మట్టి 129.72 125.47
నారాయణపూర్ 37.64 34.04
జూరాల 9.66 8.61
శ్రీశైలం 215.81 210.03
నాగార్జున సాగర్ 312.05 312.05
జూరాల 45 గేట్లు ఓపెన్
గద్వాల: కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో మంగళవారం 45 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణా ఉప నది భీమా నుంచి 50 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. నారాయణపూర్ డ్యాం 25 గేట్లు ఓపెన్ చేసి 1,61,380 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలోని భీమా నదిపై ఉన్న సన్నతి బ్యారేజీ నుంచి 50 వేల క్యూసెక్కులు జూరాలకు వదులుతున్నారు. జూరాలలో 5 టీఎంసీలు నిల్వ ఉంచుకొని 44 గేట్ల ద్వారా 1,78,948 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,148 క్యూసెక్కులతో కలిపి 2,10,777 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
సాగర్ 2 క్రస్టు గేట్లు ఓపెన్
హాలియా: శ్రీశైలం డ్యాం నుంచి వరద నీరు వస్తుండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దీంతో డ్యాం అధికారులు మంగళవారం సాగర్ 2 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేరకు ఎత్తి 16,200 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి సాగర్ కు 45,554 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులు(312.50 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 590 అడుగుల గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరింది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 9,443 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,280 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,354 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, వరద కాల్వకు 600 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.