బషీర్ బాగ్, వెలుగు: కృష్ణతత్వమే మానవ జీవిత సారాంశమని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన హెరిటేజ్ ఫెస్ట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి మాట్లాడారు.
.విద్యార్థుల్లో సాంస్కృతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు హరే కృష్ణ మూమెంట్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు తాము సాధించలేనిది పిల్లల ద్వారా సాధించాలనుకొనే ధోరణి మంచిది కాదన్నారు. సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ మాట్లాడుతూ... రాష్ట్రంలో 250 స్కూళ్ల నుంచి 23 వేల మంది విద్యార్థులు ఈ హెరిటేజ్ ఫెస్ట్ లో పాల్గొన్నారన్నారు. ఈ ఫెస్ట్ కేవలం సాంస్కృతిక పోటీలకు మాత్రమే వేదిక కాదని, సమగ్ర అభివృద్ధికి తోడ్పడే వారధి కూడా అని చెప్పారు.