నటుడు, నిర్మాత గానే కాకుండా దర్శకుడిగా కూడా సూపర్ స్టార్ కృష్ణ సూపర్ సక్సెస్ అయ్యారు. వెండితెర పై దర్శకుడిగా తన పేరును వేసుకోనప్పటికి పద్మాలయ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాల్లో ఆయన కీరోల్ పోషించేవారు. ‘సింహాసనం’ చిత్రం దర్శకుడిగా కృష్ణకు తొలి సినిమా. ఈ సినిమాను రెండు భాషల్లో ఆయన తెరకెక్కించారు. అ తరువాత నాగాస్త్రం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం వంటి హిట్ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో రూపొందించారు.
దీపక్, కాంచి కౌల్ హీరోహీరోయిన్ లుగా సానా యాదిరెడ్డి దర్శకత్వంలో తెలుగులో వచ్చిన సంపంగి చిత్రాన్ని ఇష్క్ హై తుమ్‌సే అనే పేరుతో హిందీలో రీమేక్ అయింది. ఈ రీమేక్ కు కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. డినో మోరియా, బిపాసా బసు లీడ్‌రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమాను పద్మాలయ స్టూడియోస్ పై ఆదిశేషగిరిరావు నిర్మించారు. హిమేష్ రేష్మియా సంగీతం అందించారు. 2004 లో రిలీజైన ఈ మూవీ అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.