కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్​ అమల్లోకి వచ్చేసింది

  • బోర్డుల గెజిట్ నిలిపేసే ప్రసక్తే లేదు 
  • మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా, గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డుల గెజిట్​ నోటిఫికేషన్​ ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, కాబట్టి దాన్ని నిలిపేసే ప్రసక్తే లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ తేల్చి చెప్పారు. సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్​ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నోటిఫికేషన్​ వచ్చిన 60 రోజుల్లోగా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున రెండు రాష్ట్రాలు సీడ్​ మనీ ఇవ్వాల్సి ఉందని, కానీ, గోదావరి బోర్డుకు రెండు రాష్ట్రాలూ ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేదని చెప్పారు. కేఆర్​ఎంబీకి సీడ్​ మనీ ఇచ్చేందుకు రెండు రాష్ట్రాల ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​లు ఓకే చెప్పాయన్న సమాచారం వచ్చిందన్నారు. గెజిట్​లోని రెండో షెడ్యూల్​లో పేర్కొన్న ఒక్క ప్రాజెక్టును కూడా రెండు రాష్ట్రాలు గోదావరి బోర్డుకు అప్పగించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలోని నాలుగు కంపోనెంట్లు, రైట్​ బ్యాంక్​ పవర్​ హౌస్​, నాగార్జునసాగర్​ కుడి కాలువపై పవర్​హౌస్​లు అప్పగిస్తూ అక్టోబర్​ 14న ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం రాలేదన్నారు. గెజిట్​ అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్​లను సమర్పించి అనుమతులు తీసుకుకోవాల్సి ఉందని తెలిపారు. గోదావరి బోర్డుకు తెలంగాణ ఆరు ప్రాజెక్టుల డీపీఆర్​లను ఇచ్చిందని, ఏపీ నుంచి ఎలాంటి డీపీఆర్​లూ అందలేదని ఆయన చెప్పారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్​లను ఇచ్చేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టైం కోరాయని చెప్పారు. గెజిట్​నోటిఫికేషన్ల అమలు కోసం రెండు బోర్డుల సభ్యులు, రాష్ట్రాల అధికారులతో సబ్​ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు.