
శ్రావణ మాసంలో అన్నీ విశేషాలే. అత్యంత భక్తిభావంతో , ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు , వరలక్ష్మీ వ్రతంతో పాటు మరో విశేషం కూడా ఉంది. ఈ మాసంలోనే శ్రీ కృష్ణుని జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు. తన లీలలతో భక్తి , జ్ఞానం , యోగం , మోక్షం గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణపరమాత్మ పుట్టిన శుభదినం శ్రీ కృష్ణాష్టమి. దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు. అంతేకాదు గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా కూడా అందరూ విశేషంగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి విశిష్టత... పండుగను ఎలా జరుపుకోవాలి... కన్నయ్యను ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .
పూర్వం వేలకొలది రాక్షసులు ద్వాపరయుగం చివరిలో మహారాజుల వంశములో జన్మించారు. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రాదులు, కలిపురుషుని అంశతో దుర్యోధనాదులు జన్మించారు. వీరి పరిపాలనను భూమి తట్టుకోలేక పోయిందట. అప్పడు భూమి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రక్షించమని ప్రార్థించిందని దేవాంగ పురాణంలో పేర్కొన్నారు. బ్రహ్మ ఆమెను ఓదార్చి, ఆమెతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడట. అప్పుడు శ్రీహరి వారికి అభయం యిచ్చి వారికి కనబడకుండా తాను త్వరలో భూమి మీద అవతరించి దుష్టశిక్షణ చేస్తానని వరమిచ్చాడని విష్ణుపురాణంలో పేర్కొన్నారు.
అలా వరమిచ్చిన స్వామి వారు శ్రావణమాసంలో బహుళాష్టమీ తిథినాడు సరిగ్గా అర్ధరాత్రి పూట, సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శనైశ్చరుడు ఈ ఐదుగురు ఉచ్ఛ స్థితిలో నుండగా శ్రీకృష్ణుడనే నామంతో అవతరించాడని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి . అలా 125 సంవత్సరాలు ఈ అవతారంలో భూమి మీద నివసించి అనేక లీలలు చేసి చూపించాడు. రాక్షసులను చంపి భూభారం తొలగించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నింటినీ మించి ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ అందించని మహాద్భుత గ్రంథాన్ని భగవద్గీత ను లోకానికి అర్జునుడనే శిష్యుని తో అందించాడు.
జగద్గురుడంటే శ్రీకృష్ణుడే ...
- భగవంతుడు 22 అవతారాలు ఎత్తుతాడనీ, వాటిలో 21 అంశావతారాలనీ, ఒక్క శ్రీకృష్ణావతారమే పరిపూర్ణావతారమనీ శ్రీమద్భాగవతం చెబుతోంది.
- ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్ అని వ్యాస మహర్షి చెప్పారు
- శ్రీకృష్ణావతారాన్ని లోకానికి అందించిన పవిత్రమాసం శ్రావణ మాసం. ఈ తిథినాడు శుచిగా ఉండి, శ్రీకృష్ణుడిని పది తులసీదళాలతో పూజించాలని పూజారులు చెబుతున్నారు.
కృష్ణుడి దశ మంత్రాలు ( ఇవి చదువుతూ కృష్ణుడిని తులసి పత్రాలతో పూజించాలి)
- ఓం కృష్ణాయ నమః,
- ఓం విష్ణవే నమః
- ఓం అనంతాయ నమః
- ఓం గోవిందాయ నమః
- ఓం గరుడధ్వజాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం హృషీకేశాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం హరయేనమః
- ఓం ప్రభవే నమః
- కృష్ణుడికి తాజా వెన్న సమర్పించాలి.
- కృష్ణుడు మనం భక్తితో సమర్పించిన ఎటువంటి అలంకారాన్నైనా, ఫలమునైనా, పుష్పమునైనా, పత్రమునైనా స్వీకరిస్తాడు.
- కృష్ణుని విగ్రహానికి షోడశోపచార పూజలు చేయాలి, తులసీదళాలతో పూజించాలి.
- మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసీదళాలతో పూజిస్తే తప్పక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
- కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి ఆవు పాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు.
- సాయంత్రం కృష్ణ మందిరానికి వెళ్లి కృష్ణ దర్శనం చేసుకోవాలి.
- తరువాత ప్రదక్షిణ చేసిన వానికి శ్రీకృష్ణానుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు అంటున్నారు.