ఎర్రుపాలెం, వెలుగు : వెయ్యి క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి రైతులకు డబ్బులు ఇవ్వకుండా పరార్ అయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని ములుగుమాడు గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తి అదే గ్రామానికి పలువురు మిర్చి రైతుల వద్ద నుంచి కొన్ని రోజుల కింద సుమారు వెయ్యి క్వింటాళ్ల మిర్చి కొనుగోలు చేశాడు.
15 రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఎంతకూ ఇవ్వడం లేదు. రైతులు కృష్ణారావు ఇంటికి వెళ్లడంతో అతడు కనిపించలేదు. దీంతో రైతులు శనివారం ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిర్చి కొన్న వ్యాపారి గ్రామంలో కనిపించడం లేదని, అతడి గురించి తల్లిదండ్రులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, 15 రోజుల నుంచి వారు కూడా కనిపించడం లేదని రైతులు తెలిపారు. మొత్తం మిర్చి విలువ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని రైతులు చెప్పారు.