శ్రీశైలంకు 70వేల క్యూసెక్కుల వరద

  • వర్షాలకు కృష్ణా నదిలో మళ్లీ మొదలైన వరద ప్రవాహం

శ్రీశైలం: ఎగువన కర్నాటక, మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో మళ్లీ వరద ప్రవాహం మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటీమట్టానికి చేరుకుంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని వస్తున్నట్లే దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం జూరాల ప్రాజెక్టు వద్ద 5 గేట్లు తెరచి నీటి విడుదల చేపట్టిన అధికారులు తాజాగా వరద పెరగడంతో  12 గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నారు. 
జూరాల నుంచి వడివడిగా శ్రీశైలానికి
జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న వరద నీరు వడివడిగా శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. నీటిపారుదల అధికారుల వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో  శ్రీశైలం జలాశయానికి వరద (ఇన్ ఫ్లో) 69,855 క్యూసెక్కులు వస్తోంది.  ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా....   ప్రస్తుతం 820.37 అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 41.11 (19.05%) టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణ ఆధీనంలోని ఎడమగట్టు (తెలంగాణ) జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.... ఏపీ ఆధీనంలో ఉన్న కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు.