శ్రీశైలానికి 36 వేల క్యూసెక్కుల వరద

  • 822,70 అడుగులకు చేరిన నీటిమట్టం

కృష్ణా నదిలో  వరద ప్రవాహం కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందు 800 అడుగులకు పడిపోయిన శ్రీశైల జలాశయ నీటిమట్టం తాజాగా 22 అడుగులకు చేరుకుంది. మహారాష్ట్ర, కర్నాటకలోని  కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షలకు ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం సగానికిపైగా నిండిపోయింది. మరో వైపు ఆల్మట్టికి దిగువన నారాయణపూర్, జూరాల పరిధిలో కురిసిన వర్షాలకు వరద ప్రవాహం 32వేల క్యూసెక్కులకు చేరుకుంది. 
కృష్ణానదికి ఎగువన తుంగభద్ర నుండి వరద రాకపోయినా.. హంద్రీ, వక్కెర వాగుల మీదా 10 వేల క్యూసెక్కులకుపైగా వరద రావడంతో ఇవాళ ఉదయం వరకు శ్రీశైలం డ్యాం కు వరద ఇన్ ఫ్లో 44వేలకు చేరుకుంది. తుంగభద్రవైపు నుండి తగ్గిపోవడంతో ఇన్ ఫ్లో 36 వేలకు పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం జూరాల నుంచి 32 వేలు, హంద్రీ తదితర ప్రాంతాల నుంచి 4 వేల క్యూసెక్కుల వెరశి శ్రీశైలానికి 36 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. 
నెమ్మదిగా పెరుగుతున్న శ్రీశైలం నీటిమట్టం
తాజా సమాచారం ప్రకారం శ్రీశైలం జలాశయానికి 36,207 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుండగా.. నీటిమట్టం 822.70 అడుగులకు చేరుకుంది. ఎడమగట్టు జలాశయంలో తెలంగాణ ప్రభుత్వం  విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు సమాచారం. శ్రీశైలం డ్యామ్ పూర్తి నీటి నిల్వ స్థాయి 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 42.8708 టీఎంసీలకు చేరుకుంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో (తెలంగాణ) విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.. కుడిగట్టు (ఏపీ) విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు.