కృష్ణా తీరం వెంట .. రాళ్లు,మట్టి కుప్పలు

కృష్ణా తీరం వెంట ..  రాళ్లు,మట్టి కుప్పలు

నాగర్​కర్నూల్, వెలుగు :  ఏటా వరదలతో కృష్ణానదిలో పూడిక సమస్య తీవ్రమవుతున్నది. కేఎల్ఐ, పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీళ్లందించే కోతిగుండు, రేగుమాను గడ్డ ప్రాంతం కుంచించుకుపోయి నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన నెలకొంది. పాలమూరు కాంట్రాక్టర్లు, ఇరిగేషన్​ ఇంజినీర్లు నల్లమల, కృష్ణా నదీ తీర పర్యావరణ సమతుల్యతకు గండికొట్టేలా రాళ్లు, రప్పలు, మట్టి పోస్తున్నారు. కేఎల్ఐ, పాలమూరు అప్రోచ్​కెనాల్స్ మధ్యలో పోస్తున్న ఈ రాళ్లు, మట్టితో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృష్ణా నదికి వరద పెరిగితే బ్యాక్​వాటర్​లోని రాళ్లు, మట్టి అప్రోచ్​కెనాల్స్​లోకి కొట్టుకు వచ్చే ప్రమాదం ఉందని, దీంతో కేఎల్ఐతో పాటు మిషన్​భగీరథ ప్రాజెక్ట్​పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. 

పెద్ద గుట్టలు తయారు చేసిన్రు..

కేఎల్ఐ ప్రాజెక్ట్​లోని మొదటి లిఫ్ట్​అయిన ఎల్లూరు పంప్​హౌజ్, సర్జ్​పూల్, అప్రోచ్​కెనాల్​నిర్మాణ సమయంలో తవ్విన 26 వేల క్యూబిక్​ మీటర్ల మట్టి, రాళ్లను కృష్ణా తీర ప్రాంతంలో అప్రోచ్​కెనాల్ చుట్టూ పోయడంతో గుట్టలు తయారయ్యాయి. నల్లమల అడవిలో కురిసే భారీ వర్షాలకు ఈ మట్టి, రాళ్లు అప్రోచ్ కెనాల్​లోకి జారుతున్నాయి. ఈ సమస్య ఇట్ల ఉండగానే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులో 2 కిలోమీటర్ల ఓపెన్​అప్రోచ్​కెనాల్, మూడు టన్నెల్​కెనాల్స్, పంప్​హౌజ్, సర్జ్​పూల్, ఆడిట్, ఎస్కేప్​టన్నెల్​చానల్స్​తవ్వకాలతో వస్తున్న సుమారు 80 వేల క్యూబిక్​మీటర్ల​మట్టి, రాళ్లు, గుండ్లను కూడా కృష్ణా నదితీర ప్రాంతంలోని బ్యాక్​ వాటర్​లో పోస్తున్నారు. పాలమూరు-–రంగారెడ్డిలోని ఫస్ట్​లిఫ్ట్​లో భాగంగా నార్లాపూర్​లో ఓపెన్ ​పంప్​హౌజ్, సర్జ్​పూల్​నిర్మించాలని డీపీఆర్​లో ఉన్నా, దాన్ని కాస్తా అండర్ గ్రౌండ్​కు మార్చారు. దీంతో తవ్విన మట్టి, రాళ్లు, గుండ్లను పోసేందుకు ఎల్లూరు సమీపంలో 45 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నించగా, రైతులు అడ్డుకున్నారు. రెండు ప్రాజెక్టుల అప్రోచ్​కెనాల్స్​ఉన్న ప్రాంతం నదీ తీరం కావడం, చుట్టూ అడవి ఉండడంతో ఎక్కడ పోయాలో అర్థం కాక కాంట్రాక్టర్లు నదీ తీర ప్రాంతంలో పోస్తున్నారు. పదికిలోమీటర్ల అవతల భూమి ఉన్నా సర్కారు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.  

ఒండ్రు సమస్యకు తోడైన మట్టి, రాళ్లు..

కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగినప్పుడు అమరగిరి తీరం కోతిగుండు నుంచి రేగుమాను గడ్డ వరకు బ్యాక్​ వాటర్ ​చేరుతుంది. కృష్ణా నదికి ముఖద్వారంలా ఉండే కోతిగుండు ప్రాంతం గుట్టల మధ్యలో ఉంటుంది. ఇక్కడ కేవలం 50 మీటర్ల  వెడల్పు ఉండడం , అందులో ఏటా ఒండ్రు పేరుకుపోవడం వంటి సమస్యలతో మూడు మేజర్​ప్రాజెక్టులకు నీరందించే రేగుమాను గడ్డలో నీటి లభ్యత తగ్గిపోతోంది. శ్రీశైలం రిజర్వాయర్​పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా, అక్కడ 825 అడుగుల వరకు నీరున్నా రేగుమాను గడ్డ వద్ద బ్యాక్​వాటర్​ నిలిచి ఉంటుంది. ఒండ్రు మట్టి కారణంగా కృష్ణా నదిలో, బ్యాక్​వాటర్ ​నిలిచే ప్రాంతంలో దాదాపు 25 శాతం స్టోరేజీ కెపాసిటీ తగ్గిందని నిపుణులంటున్నారు. ఒండ్రు మట్టి సమస్యకు కోతిగుండు వద్ద ఇరుకుగా ఉండడం వల్ల నీటి ప్రవాహ వేగం, నిల్వ సామర్థ్యం రెండు సమస్యగా మారుతున్నాయి.  కోతిగుండు వద్ద విస్తరిస్తే తప్ప పూర్తి స్థాయిలో బ్యాక్​ వాటర్​ చేరే అవకాశం లేదు. ఇప్పటికే కేఎల్​ఐ నిర్మాణ సమయంలో పేరుకు పోయిన మట్టి,రాళ్లు రేగుమానుగడ్డ తీరప్రాంతంలో పోయగా, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​లో అప్రోచ్​,టన్నెల్స్​ కెనాల్స్​,పంప్​హౌజ్​,సర్జ్​పూల్​,ఆడిట్​,ఎస్కేప్​ టన్నెల్​ తవ్వకాలతో పేరుకుపోతున్న మట్టి,రాళ్లను కూడా ఇదే ప్రాంతంలో పోస్తున్నారు.  రెండు ప్రాజెక్టుల అప్రోచ్​ కెనాల్స్​ మధ్య బ్యాక్​ వాటర్​లో , అప్రోచ్​ కెనాల్స్​ ముందు భాగంలోను రాళ్లు, మట్టి పడుతున్నాయి. వర్షాలు, వరదలకు అప్రొచ్​ కెనాల్స్​లోకి రాళ్లు, మట్టి చేరితే కెఎల్​ఐ మొదటి లిఫ్ట్​,మిషన్​ భగీరథ ప్రాజెక్ట్​ మనుగడ ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:ఐదు నెలల్లో పది లక్షల మంది 

ఇదేమైనా కొత్తనా? 


‘ఎల్లూరు సమీపంలో కేఎల్ఐ ఫస్ట్​ లిఫ్ట్​ నిర్మాణంలో భాగంగా పంప్​హౌజ్​, సర్జ్​పూల్​, అప్రోచ్​ కెనాల్స్​లో వచ్చిన మట్టిని రేగుమాను గడ్డ తీరప్రాంతంలోనే పోశారు. ఇప్పుడు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​ వేస్ట్​ మెటిరీయల్​ను కూడా ఇక్కడే పోస్తున్నాం. ఇదేమైనా కొత్తనా? రెండున్నరేండ్ల నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇరిగేషన్​ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రాజెక్టులకు నీరందించే అప్రోచ్​ కెనాల్స్​ ముందు భాగంలో బ్యాక్​వాటర్​ నిల్వ ప్రాంతంలో రాళ్లు, మట్టి నింపుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లగా..అటువంటిది ఏదైనా ఉంటే తొలగించేలా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. 

నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణా తీరంలో నిర్మాణమవుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​లో ప్రతిరోజూ పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పర్యవేక్షించే వ్యవస్థే లేదు. తీర ప్రాంతంలో బ్యాక్​వాటర్​ నిల్వకు,160 టీఎంసీల నీటి వినియోగానికి ఆటంకాలు రాకుండా చూడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్​ అధికారులకు సదరు కాంట్రాక్ట్​ ఏజెన్సీ పేరు వినగానే చెమటలు పడుతున్నాయి. అడవి, నది, పర్యావరణం. ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన ప్రధాన రాజకీయ పక్షాల లీడర్లు ఈ సమస్యపై మాట్లాడేందుకు ఇష్ట పడటం లేదు.