
- శ్రీశైలంలో మినిమమ్ డ్రా డౌన్ లెవెల్ 820 అడుగులుగా నిర్ధారణ
- మీటింగ్ మినిట్స్ విడుదల చేసిన కేఆర్ఎంబీ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 65 టీఎంసీల నీళ్లే ఉన్నాయని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వెల్లడించింది. బుధ, గురువారాల్లో జరిగిన బోర్డు మీటింగులకు సంబంధించిన మినిట్స్‌ను శుక్రవారం బోర్డు విడుదల చేసింది. బుధవారం నాటి మీటింగ్‌కు ఏపీ అధికారులు హాజరుకాలేదని, తెలంగాణ రిప్రజెంటేషన్లను తీసుకున్నామని పేర్కొన్నది.
ఏపీ గైర్హాజరుతో గురువారం మీటింగ్ నిర్వహించామని తెలిపింది. శ్రీశైలంలో మినిమమ్ డ్రా డౌన్ లెవెల్‌ను 820 అడుగులుగా నిర్ధారించినట్టు వెల్లడించింది. ఆపైన రిజర్వాయర్‌లో 35.613 టీఎంసీలు ఉన్నాయని పేర్కొన్నది. సాగర్ మినిమమ్ డ్రా డౌన్ లెవెల్‌ను 515గా నిర్ధారించామని, అందులో 29.593 టీఎంసీలున్నాయని తెలిపింది.
ఉన్న నీటిలోనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తమ పొలాలను కాపాడుకునేందుకు పొదుపుగా తీసుకునేలా రాజీకి వచ్చాయని, రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకుని నీటిని తీసుకునేందుకు ఒప్పుకున్నాయని చెప్పింది. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అవసరాలకు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వ కన్నా ఎక్కువ ఇండెంట్ పెట్టాయని పేర్కొన్నది.
అయితే, ఎండాకాలం దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు రాకుండా రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని చూసి వాడుకోవాల్సిందిగా సూచించామని తెలిపింది. ప్రతి 15 రోజులకోసారి ఈఎన్సీలు, ప్రతి నెలాఖరున రెండు రాష్ట్రాల సెక్రటరీలు మీటింగ్ ఏర్పాటు చేసుకుని నీటి లభ్యతపై చర్చించుకోవాలని, అందుకు అనుగుణంగా నీటి వినియోగంపై ముందుకు వెళ్లాలని సూచించినట్టు వెల్లడించింది.