జల వివాదాలపై స్పందించిన కృష్ణానది బోర్డు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఎట్టకేలకు స్పందించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రాసిన లేఖల్లోని ఫిర్యాదులను ప్రస్తావిస్తూ ఇరు రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసింది. శ్రీశైలం ప్రాజెక్టుతోపాటు నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కృష్ణా నది పై చేపట్టిన సంగమేశ్వరం (రాయలసీమ లిఫ్ట్ స్కీమ్) ఎత్తిపోతల పధకాన్ని, అలాగే తుంగభద్రపై ఆర్డీఎస్ నుండి చేపట్టిన కుడి కాలువ నిర్మాణాన్ని  వెంటనే ఆపేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు రాసింది. 
ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై సమాధానం చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. గ్రిడ్ కు అత్యవసర పరిస్తితి ఉంటే తప్ప విద్యుత్ ఉత్పత్తి చేయరాదన్న నిబంధనను బోర్డు సభ్యుడు మౌతంగ్ ప్రస్తావిస్తూ తెలంగాణ జెన్ కోకు లేఖ రాశారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం, పులిచింతల, నాగార్జునసాగర్, వద్ద విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి విడుదల ఆపాలని కోరారు. 
తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ నుంచి కుడికాలువ నిర్మాణం పనులు కొనసాగించరాదంటూ ఏపీ ప్రభుత్వానికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్ కేఆర్ఎంబీకి అందలేదని.. ఆర్డీఎస్ పనులు కొనసాగుతున్నాయన్న తెలంగాణ ఫిర్యాదు చేసిందని ప్రస్తావించారు. బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, తమ అంగీకారం తీసుకోకుండా ఆర్డీఎస్ కుడికాలువ పనులు చేపట్టవద్దని ఏపీకి స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో జలాలు, నీటి వనరుల వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులకు సమాధానం చెప్పాలని లేఖలో కోరారు. 
రేపు కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్లు
గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ రేపు శుక్రవారం నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తారా స్థాయికి చేరుకున్న నేపధ్యంలో కేంద్ర జలశక్తి శాక స్పందించనుంది. రేపు మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ తదితర అంశాలపై  గెజిట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు సమాచారం.