
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) అత్యవసర సమావేశం సోమవారానికి వాయిదా పడింది. సమావేశం వాయిదాపై రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సమాచారం అందించింది. ఏపీ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తిని మన్నించి ఈ సమావేశాన్ని కృష్ణా బోర్డు వాయిదా వేయడం గమనార్హం.
ఏపీ తన కోటాకు మించి నీటిని తరలించుకుపోతున్నా ఏమీ జరగనట్టే కృష్ణా బోర్డు చోద్యం చూస్తూ ఉండిపోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటాల ప్రకారం నీటిని తీసుకోవాల్సి ఉన్నా.. ఏపీ ఇప్పటికే తన వాటా 512 టీఎంసీలకు మించి అదనంగా 130 టీఎంసీలనూ తోడేసుకున్నది. అయినా ఏపీని కృష్ణా బోర్డు అడ్డుకోవడం కాదు కదా.. కనీసం ప్రశ్నించడం లేదు.
త్రీమెన్కమిటీ మీటింగ్పెట్టి ఏపీ నీటి దోపిడీని నివారించాల్సింది పోయి.. స్పందించడమూ మానేసింది. ఈ నేపథ్యంలోనే అసలు బోర్డు ఉండీ దండగేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల వివాదాలను తొలగించేందుకు కేఆర్ఎంబీని 2014లో కేంద్రం ఏర్పాటు చేసింది. విభజన చట్టంలోనే బోర్డు ఏర్పాటు గురించి పేర్కొన్నది. రెండు రాష్ట్రాలూ ఎంతెంత నీటిని వాడుకుంటున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. కానీ, పదేండ్లుగా ఏపీ దోపిడీ కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా బోర్డు ఆ రాష్ట్రాన్ని నిలువరించలేకపోయింది.
ఏపీ తీరుపై బోర్డు మీటింగ్లలో తెలంగాణ అధికారులు ఎండగట్టినా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కేఆర్ఎంబీ చైర్మన్ వద్దకు స్వయంగా ఈఎన్సీ వెళ్లి ఫిర్యాదు చేసే స్థితికి పరిస్థితి దిగజారింది. అధికారులు ఎప్పుడు ఏపీ తీరుపై ప్రశ్నించినా.. ప్రాజెక్టులు బోర్డు పరిధిలో లేనప్పుడు తాము మాత్రం ఏపీని ఎలా నిరోధిస్తామంటూ బోర్డు అంటోందనే వాదనలు ఇరిగేషన్వర్గాల్లో వినిపిస్తున్నాయి.
Also Read : బీజేపీ ప్రభుత్వానికి..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ సమానమే
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డుకు అప్పగిస్తే పూర్తి నియంత్రణ సాధ్యమవుతుందంటూ బోర్డు మెలిక పెడుతోందనే చర్చ జరుగుతున్నది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ సిద్ధంగానే ఉన్నా.. రాష్ట్ర సర్కారు రెడీగా లేదు. బోర్డుకు అప్పగిస్తే తెలంగాణ ప్రయోజనాలు మరింత దెబ్బతింటాయనే ఆందోళనలో సర్కారు ఉంది. ఏపీ ఎత్తుగడ కూడా అదేనని అంటున్నారు.