హైదరాబాద్: రేపు శుక్రవారం జరగాల్సిన కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని బోర్డు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు భగ్గుమని రగులుకుంటున్న నేపధ్యంలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం రేపు శుక్రవారం జరగాల్సిన భేటీపై ఉత్కంఠ ఏర్పడింది.
ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ వద్ద అక్రమంగా కుడి కాలువ నిర్మించి తుంగభద్ర నీటిని తరలించుకుపోయేందుకు కుట్ర చేస్తోందని, అలాగే కృష్ణా నదిపై అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం (సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్) ద్వారా కృష్ణా జలాలను తరలించుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పథకాలు వెంటనే ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
మరో వైపు ఏపీ ప్రభుత్వం కూడా కృష్ణా బోర్డుకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఫిర్యాదు చేసింది. కృష్ణా బోర్డుతోపాటు... కేంద్ర జల శక్తి శాఖకు.. ప్రధాని నరేంద్ర మోడీకి సైతం లేఖ రాసి వెంటనే జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన అంటే రేపు శుక్రవారం కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన లేఖలో ఈనెల 20వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని కోరడం వల్లే సమావేశం వాయిదాపడినట్లు సమాచారం.