
గోదావరి వరద జలాలనే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం. దీని వల్ల తెలంగాణకు ఏమి నష్టం?’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్నా దాని వెనుక ఉన్న ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గోదావరి – బనకచర్ల (జీబీ) లింకును నేరుగా సాగర్కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌కు మళ్లించడమంటే కృష్ణా నీటి దోపిడీకీ ఇది మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందనడంలో సందేహం లేదు.
Also Read :- ఏపీ జలదోపిడీకే బనకచర్ల.. కృష్ణాకు గండి గోదాట్లో తోండి
కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అదే అదనుగా కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును బాబు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా లెక్కాపత్రం లేకుండా, టెలీమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరిని, కృష్ణాతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తిచేస్తే ఏ నీళ్లు ఎటువెళ్తున్నాయో తెలుసుకునేలోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కృష్ణా జలాల కేటాయింపులు ఇలా:
- కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 (బచావత్ ట్రిబ్యునల్) 1973లో కృష్ణా బేసిన్ రాష్ట్రాలైన ఏపీ (ఉమ్మడి), మహారాష్ట్ర, కర్నాటకలకు ఎన్‌బ్లాక్(గంపగుత్తా) కేటాయింపులను చేసింది.
- 75 శాతం డిపెండబిలిటీ (ఒక వాటర్ ఇయర్లో గరిష్ఠ వరద వచ్చే సంభావ్యత) ఆధారంగా ఒక వాటర్ ఇయర్లో 2,060 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని ట్రిబ్యునల్ తేల్చింది. అందులో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు (11 టీఎంసీలు రీజనరేటివ్ ఫ్లోస్ కలిపి), మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700టీఎంసీలను కేటాయించింది. దీనిపై కేంద్రం 1976 మే 31న గెజిట్‌ను ప్రచురించింది.
- 2010లో కేడబ్ల్యూడీటీ 2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) బచావత్ ట్రిబ్యునల్ అవార్డును రివ్యూ చేసింది.
- 47 ఏండ్ల సగటు వరదలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 2,578 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని తేల్చింది.
- దానికి అనుగుణంగా ఏపీకి 1001, కర్నాటకకు 911, మహారాష్ట్రకు 666 టీఎంసీల నికర జలాలను కేటాయించాల్సి ఉంటుందని సూచించింది. అయితే, కేడబ్ల్యూడీటీ 2 డ్రాఫ్ట్ అవార్డుకు కేంద్రం గెజిట్ ఇవ్వలేదు. 2013లో ఫైనల్ తీర్పు ఇచ్చిన ట్రిబ్యునల్.. బచావత్ అవార్డే కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా కేటాయింపులున్నాయే తప్ప.. రీజియన్ల వారీగా కేటాయింపులు చేయలేదు.