కేసీఆర్ ​సభతో.. నల్గొండలో ఉత్కంఠ

  •    దమ్ముంటే అడ్డుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సవాల్
  •     నల్గొండలో మినీ సభ ప్లాన్​ చేసిన స్థానిక కాంగ్రెస్​ నేతలు
  •     పదేండ్లలో కేసీఆర్​ తీరును ఎండగడతామని ప్రకటన
  •     ఇరు సభల నిర్వహణపై ఆంక్షలు విధించిన పోలీసులు

నల్గొండ, వెలుగు :  కృష్ణా జలాల వివాదంపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్​నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. మంగళవారం నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన ‘చలో నల్గొండ’ బహిరంగ సభను బహిష్కరించాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా కాంగ్రెస్​ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. కౌంటర్​గా దమ్ముంటే కేసీఆర్ సభను అడ్డుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సవాల్​విసిరారు. బీఆర్ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ ​నాయకులు మంగళవారం ఉదయం క్లాక్​టవర్ ​సెంటర్​లో మినీ సభ ప్లాన్​చేశారు.

బీఆర్ఎస్​హయాంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును ఎండగడతామని ప్రకటించారు. పదేండ్ల పదవీ కాలంలో కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అందుకోసం పెద్ద ఎత్తున ఎల్ఈడీ స్క్రీన్​లు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం సొరంగ మార్గం వద్ద కుర్చీ వేసుకుని నల్గొండ జిల్లా ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, అందుకు నిరసనగా క్లాక్​ టవర్ వద్ద పింక్​ టవల్, కుర్చీ వేసి, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామని కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్​ స్పష్టం చేశారు.

కృష్ణా జలాల చుట్టూ పాలిటిక్స్

కృష్ణా జలాల మీదున్న ప్రాజెక్టులను రాష్ట్ర​ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్​బహిరంగ సభ ప్లాన్​చేసింది. సభ నిర్ణయం జరిగినప్పటి నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కృష్ణా జలాల వివాదం మరోసారి చర్చకు దారితీసింది. పదేండ్లలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని కేసీఆర్... ఇప్పుడు కృష్ణా జలాల పేరుతో రాజకీయ డ్రామాకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. తెలంగాణ రాక ముందు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు. నిధులు లేవన్న సాకుతో కొత్త, పాత ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారని,  ఎన్నికలప్పుడు తప్పా.. కేసీఆర్​ఏనాడూ ప్రాజెక్టుల ఊసెత్తలేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మండిపడుతున్నారు. 

బీఆర్ఎస్ ​నేతల ఎదురుదాడి

మంత్రులు, కాంగ్రెస్​ఎమ్మెల్యేలు, నాయకుల కామెంట్లు, విమర్శలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్, మాజీ ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు. పదేండ్లుగా కృష్ణా జలాల మీదున్న ప్రాజెక్టులు తమ కంట్రోల్​లోనే ఉన్నాయని చెబుతున్నారు. కృష్ణా జలాల కోసం పోరాడాల్సిన కాంగ్రెస్ నాయకులే తమను ఎదురు ప్రశ్నించడం ఏమిటంటున్నారు.

15 ఏండ్ల కింద ప్రారంభించిన శ్రీశైలం సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం రిజర్వాయర్లతోపాటు, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ​శంకుస్థాపన చేసిన డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీం, నెల్లికల్లు, అయిటిపాముల లిఫ్ట్​స్కీంలపైన శ్రద్ధ చూపని జిల్లా బీఆర్ఎస్​నాయకులు తమని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్​నాయకులు అంటున్నారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్​మోహన్ రెడ్డి కుట్రతో కృష్ణా నీళ్ల విషయంలో నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని, పదేండ్లలో ఏనాడూ బీఆర్ఎస్​ నాయకులు మాట్లాడలేదని మండిపడుతున్నారు. 

నెలరోజులు పోలీస్​యాక్ట్​ 36 అమలు

బీఆర్ఎస్ సభపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించుకుండా నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ 36 అమలు చేస్తున్నట్టు ఎస్పీ చందనాదీప్తీ తెలిపారు. మంగళవారం బీఆర్ఎస్ నిర్వహించే సభకు షరతులతో కూడిన అనుమతిచ్చారు. సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సభ నిర్వహించేందుకు ఓకే చెప్పారు. వ్యక్తిగత దూషణలు, మతపరమైన కామెంట్లు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయొద్దని సూచించారు. అలాగే ఉదయం 11 గంటలకు కాంగ్రెస్​ నిర్వహించే మినీ సభపైనా ఆంక్షలు విధించారు. వంద మందితో సభ పెడతామని కాంగ్రెస్​నాయకులు పర్మిషన్​తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.