దర్జాగా నీళ్ల దోపిడీ.. 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకపోతున్న ఏపీ

దర్జాగా నీళ్ల దోపిడీ.. 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకపోతున్న ఏపీ
  • పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు.. ట్రిబ్యునల్​ ముందు వాదనలకు రెడీ
  • కృష్ణా నుంచి ఐదేండ్లలో ఏటా అదనంగా 100కుపైగా టీఎంసీల తరలింపు
  • 2018 నుంచి మరింత రెచ్చిపోయిన ఏపీ
  • 2019, 2020, 2021, 2022లో అదనంగా 70 శాతానికి పైగా వాడకం
  • 2024లో ఇప్పటిదాకా 75 శాతానికిపైగానే మళ్లింపు..
  • 11 ఏండ్లలో ఒక్కసారి కూడా మన కోటా నీళ్లు మనకు దక్కలే! 
  • నేటి నుంచి ట్రిబ్యునల్​ విచారణ.. లెక్కలను ముందుపెట్టనున్న తెలంగాణ

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్లను ఏపీ అడ్డంగా దోచుకుపోతున్నది. 11 ఏండ్లలో కరువు సంవత్సరాలు సహా ఏటా కోటాకు మించి నీటిని తోడేసుకున్నది. తెలంగాణకు మాత్రం ఏ ఒక్క సంవత్సరంలో కూడా కేటాయించిన కోటా దక్కలేదు. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలను రాష్ట్ర అధికారులు సేకరించారు. ఏ ఏడాది.. ఎవరెవరు, ఎంతెంత కృష్ణా జలాలు వాడుకున్నారో లెక్కలు తీశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 11 ఏండ్లలో ఏపీ జలదోపిడీ ఏ స్థాయిలో జరిగిందో చెప్పేలా ఈ గణాంకాలు ఉన్నాయి. గంపగుత్తగా రెండు రాష్ట్రాలకు 811 టీఎంసీలను కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్​కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున అలకేట్​ చేశారు. కానీ, ఏపీ మాత్రం ఏటా తన కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్లింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచే  ఈ జలదోపిడీ మొదలైంది. ఆ తర్వాత రానురాను మరింత పెరిగింది. ఓ ఐదు వాటర్​ ఇయర్లలో అయితే  ఏటా  620 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లను దొడ్డిదారిన ఏపీ తరలించుకుపోయింది. కేటాయించిన 512 టీఎంసీల కంటే అదనంగా 100 నుంచి 170 టీఎంసీల దాకా తీస్కపోయింది. ఏపీ దోపిడీపై తెలంగాణ ఇరిగేషన్​ అధికారులు ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా.. ఆ రాష్ట్రాన్ని  బోర్డ్​ కంట్రోల్​ చేయలేకపోయింది. బుధవారం నుంచి జరగనున్న ట్రిబ్యునల్​ విచారణలో రాష్ట్ర అధికారులు బలమైన వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు. నీటి లెక్కలను ట్రిబ్యునల్​ ముందు ఉంచి.. ఏపీ తీరును ఎండగట్టాలని భావిస్తున్నారు. 

మామూలు దోపిడీ కాదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లోనే ఏపీ తన దోపిడీకి తెరదీసింది. వాస్తవానికి ఏపీ కోటా ప్రకారం 512 టీఎంసీల నీళ్లే వాడుకోవాల్సి ఉన్నా.. తొలి ఏడాదిలో ఆ రాష్ట్రం 529.33 టీఎంసీలను తోడుకున్నది. అంటే అదనంగా 17 టీఎంసీలను తీసుకెళ్లింది. అదే తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నా.. వచ్చిన నీళ్లు మాత్రం 227.74 టీఎంసీలే. అంటే 71 టీఎంసీలు తక్కువగానే తెలంగాణ వాడుకున్నది. అయితే, 2015 నుంచి 2018 వరకు కృష్ణా నదికి సరైన వరదలు లేకపోవడం, నీటి లభ్యత తక్కువగా ఉన్న కారణాలతో నీటి కేటాయింపులను తగ్గించినా.. ఆ కేటాయించిన నీటికి మించి ఏపీ వాడుకుంది.

2015, 2016 సంవత్సరాలకుగానూ 63 శాతం నీళ్లను ఏపీకి కేటాయించగా.. వరుసగా 64 శాతం, 65 శాతం చొప్పున దండుకపోయింది. 2017, 2018 సంవత్సరాలకుగానూ 66 శాతం ఆ రాష్ట్రానికి కేటాయిస్తే.. 2017లో కోటా వరకే తీసుకున్నా, 2018లో మాత్రం 67.3 శాతం తోడేసింది. 2019, 2020, 2021, 2022, 2024లో మాత్రం దొరికిందే తడువుగా ఏపీ నీళ్లను తోడుకున్నది. ఆయా సంవత్సరాల్లో ఏపీ వాడుకున్న నీళ్ల వాటా 600 టీఎంసీలు దాటిపోవడం గమనార్హం.

2022లో అత్యధికంగా 681 టీఎంసీలను ఏపీ తరలించుకెళ్లింది. ఆ ఏడాది తెలంగాణ వాడుకున్నది 277 టీఎంసీలే. మొత్తంగా ఆ ఏడాది గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలకు మించి 959 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఏపీ తనకు కేటాయించిన 512 టీఎంసీల కన్నా అదనంగా 2019లో 141 టీఎంసీలు (70%), 2020లో 117 (72%), 2021లో 110 (70%), 2022లో 169 టీఎంసీల (71%) చొప్పున ఎక్కువ నీటిని మళ్లించుకున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు 134 టీఎంసీలను దోచేసింది. 

నేటి నుంచి వాదనలు 
ఏపీ తోడేసిన నీటి లెక్కలను తెలంగాణ అధికారులు తేల్చారు. బుధవారం నుంచి కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ 2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​)లో మూడు రోజుల పాటు జరగనున్న విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.  మూడు నెలల్లో తొమ్మిది సిట్టింగుల్లో తెలంగాణ వాదనలను ట్రిబ్యునల్​ విననుంది.

విభజన చట్టంలోని సెక్షన్​ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా కేటాయింపులపై వాదనలు వినాలన్న ఏపీ వాదనను కొట్టిపారేసిన ట్రిబ్యునల్​.. నదీ వివాద జలాల చట్టం సెక్షన్​ 3 ప్రకారం రాష్ట్రాల వాటాలపైనే వినాలన్న తెలంగాణ వాదనకు మొగ్గు చూపింది. దీంతో బుధవారం నుంచి సెక్షన్​ 3పై ట్రిబ్యునల్​ వాదనలు వినబోతున్నది. ఇందుకు సంబంధించి వారం రోజులుగా అడ్వకేట్లు, ఇరిగేషన్​ శాఖ అధికారులు ఢిల్లీలోనే ఉన్నారు.

వాదనలు ఎలా వినిపించాలి.. ఏ అంశాలను ట్రిబ్యునల్​ దృష్టికి తీసుకెళ్లాలనే దానిపై కసరత్తులు చేశారు. తెలంగాణకు 70 శాతం నీటి కేటాయింపులు చేసే అంశంపైనే ప్రధానంగా వాదనలను వినిపించనున్నారు. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం నాటి బీఆర్​ఎస్​ సర్కారు ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటి వాటాలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ ఒప్పందంతో రాష్ట్రానికి ఏటా తీరని అన్యాయం జరుగుతున్నదని అధికారులు అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా 70 శాతం నీళ్లు తెలంగాణకు దక్కాలన్న వాదననే ప్రధానంగా వినిపించనున్నారు. దానితో పాటు తెలంగాణ కోటాలో వాడుకోకుండా మిగిలి పోయిన జలాలను క్యారీ ఓవర్​ కింద తీసుకునే అంశంపైనా ట్రిబ్యునల్​ ముందు వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు. 

మనం చాలా నీళ్లను వాడుకోలే..
ఏపీ అంతలా నీటిని దోచుకుపోతున్నా, మనకు మాత్రం మన కోటా నీళ్లు కూడా సరిగ్గా దక్కలేదు.  ఇలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం వాడుకోకుండా మిగిలిపోయిన జలాలు ఏకంగా1,066 టీఎంసీలు. కరువు సంవత్సరాలను వదిలేస్తే.. నీటి లభ్యత అధికంగా ఉన్న సంవత్సరాల్లోనూ మన రాష్ట్రం చాలా వరకు నీటిని వినియోగించుకోలేకపోయింది.

అందుకే ఆది నుంచి అధికారులు ఒక వాటర్ ఇయర్​లో వాడుకోలేకుండా మిగిలిపోయిన జలాలను ఆ తర్వాతి సంవత్సరం వాడుకునేలా క్యారీ ఓవర్​ చేయాలంటూ ఎప్పటి నుంచో డిమాండ్​ చేస్తున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్నేండ్లూ వాడుకోని నీళ్లను క్యారీ ఓవర్​ చేయడమంటే కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక నుంచైనా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కోటాలో మిగిలిన నీళ్లను వచ్చే ఏడాది వాడుకునేలా అవకాశం ఇవ్వాలని ట్రిబ్యునల్​లో అధికారులు వాదించనున్నారు.