తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట

 తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నీళ్ల మంట
  • ఢిల్లీ కేంద్రంగా మరోసారి పావులు కదుపుతున్న చంద్రబాబు
  • గోదావరి-–బనకచర్ల లింక్​కు అనుమతివ్వాలని కేంద్రంపై ఒత్తిడి
  • జీబీ లింక్​లో సాగర్​ కుడి కాల్వ ద్వారా కృష్ణా నీళ్లకు ఎసరు
  • కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ఉత్తమ్ కలిసిన 24 గంటల్లోనే.. 
  • అదే మంత్రితో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం భేటీ
  • బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులపై మంతనాలు
  • 2016లోనే పోలవరం– సోమశిల లింక్​కు బాబు కుట్ర
  •  ఇప్పుడు రీడిజైన్​ చేసి జీబీ లింక్,​ జీఎస్ లింక్​కు పన్నాగం
  • అప్పుడు 350 టీఎంసీలైతే..  ఇప్పుడు 400 టీఎంసీలకు స్కెచ్​
  • కేసీఆర్​ నిర్వాకంతో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు గండి 
  • బీఆర్ఎస్ ​హయాంలోనే ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు సామర్థ్యాలు పెంపు
  • నాడు ఏపీకి సహకరించి నేడు రాద్ధాంతం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీళ్ల మంటలు మళ్లీ రగులుకున్నాయి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ఓవైపు తెలంగాణ పోరాడుతున్నది. 70% వాటా దక్కాలని ట్రిబ్యునల్​లో వాదనలు వినిపిస్తున్నది. కానీ, ఇదే సమయంలో ఏపీ తన కుట్రలకు తెరలేపింది. కృష్ణా జలాలపై ఢిల్లీ వేదికగా రాజకీయ పావులు కదుపుతున్నది. 

గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్​ప్రాజెక్టును ఓకే చేయించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. మన రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​ పాటిల్​తో మంత్రి ఉత్తమ్​ భేటీ అయిన 24 గంటల్లోనే.. అదే కేంద్రమంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ సమావేశమయ్యారు.  బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, నిధులపై మంతనాలు జరిపారు.

పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున వంద రోజుల పాటు 200 టీఎంసీల గోదావరి మిగులు జలాలనే బనకచర్లకు డైవర్ట్​చేస్తామని ఏపీ చెప్తున్నా.. కృష్ణా జలాలనూ అందులోనే కలిపి తరలించుకుపోయేందుకు ఎత్తులు వేస్తున్నది. పోలవరం నుంచి ఎక్కడో 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నా బేసిన్ లోని బనకచర్లకు సాగర్​మెయిన్​కెనాల్​ద్వారా కృష్ణా జలాలను గద్దలా తన్నుకుపోయేందుకు కుట్రలు చేస్తున్నది. 

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉండడం, కేంద్రంలో బీజేపీ సంఖ్యా బలం తక్కువగా ఉండడంతో.. దాన్ని అడ్డం పెట్టుకుని జీబీ లింకుకు దొడ్డిదారిన అనుమతులు పొందేందుకు, ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు సమీకరించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. 

నాడు కేసీఆర్​నిర్వాకంతో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు గండి పడింది. బీఆర్ఎస్ హయాంలోనే ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు సామర్థ్యాలను ఏపీ పెంచుకున్నది. ఈ అన్యాయాన్ని సరిచేసేందుకు తాజాగా ట్రిబ్యునల్​లో పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రధాన ప్రతిపక్షం.. ఆ పని చేయకుండా ఉల్టా సర్కారుపైనే విమర్శలు చేయడాన్ని ఇరిగేషన్​ఎక్స్​పర్ట్స్​తప్పుపడ్తున్నారు. 

అప్పుడు పక్కకు పెట్టి.. ఇప్పుడు ఎత్తులు

ఈ ప్రాజెక్టు కుట్రలు ఇప్పుడే మొదలు కాలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడే అడుగులు పడ్డాయి. అప్పుడు పోలవరం నుంచి సోమశిల ప్రాజెక్టుకు 350 టీఎంసీల సామర్థ్యంతో లింక్​ చేయాలని భావించారు. మధ్యలో కృష్ణానూ బ్యారియర్​గా వాడుదామనుకున్నారు. దాదాపు రెండేండ్ల పాటు దాని మీద వర్కవుట్​చేశారు. ప్లాన్లు, డీపీఆర్​లు సిద్ధం చేసేందుకూ రెడీ అయ్యారు. 

కానీ, నాడు గోదావరి బోర్డులో మన అధికారులు గట్టిగా వాదించడంతో 2018లో ఆ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. ఆ వెంటనే ఎన్నికలు రావడం.. అక్కడ 2019లో అధికార మార్పిడి జరగడంతో ఇన్నేండ్లు ఆ ప్రాజెక్టు మరుగున పడింది. 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం.. చంద్రబాబు సీఎం కావడంతో మరోసారి ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈసారి ‘రీడిజైన్​’ పేరిట మరో కుట్రకు తెరలేపారు. 

పోలవరం టు సోమశిల లింక్​ కాకుండా.. రెండు దశల్లో ప్రాజెక్టును చేపట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక దశలో గోదావరి–బనకచర్లతో పాటు.. మరో దశలో గోదావరి–సోమశిల లింక్​ను చేపట్టేందుకు చకచకా చంద్రబాబు పావులు కదుపుతున్నారన్న చర్చ నడుస్తున్నది. 2016లో అనుకున్న ప్రాజెక్టుకన్నా అదనంగా 50 టీఎంసీలను తరలించేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్టుగా చెబుతున్నారు. జీబీ లింక్​తో 200 టీఎంసీలు.. జీఎస్​లింక్​తో మరో 200 టీఎంసీలు కలిపి 400 టీఎంసీలను దండుకునేందుకు ఏపీ ఎత్తులు వేస్తున్నది. 

కృష్ణాతోనే ముడి..

ఇప్పటికే కృష్ణా జలాలను యథేచ్ఛగా దోచేస్తున్న ఏపీ.. జీబీ లింక్​తో ఆ దోపిడీని మరిన్ని రెట్లు పెంచబోతోంది. ప్రధానంగా నాగార్జునసాగర్ మెయిన్​కెనాల్​కు లింక్​చేయడం ద్వారా మన వాటాకు భారీగా గండి కొట్టే కుట్ర పన్నింది. ఏకంగా కృష్ణా నదినే లింక్​కోసం వాడుకోనుంది. జీబీ లింక్​తో తొలుత తాడిపూడి ప్రధాన కాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్​కుడి కాల్వకు లింక్​చేస్తారు. 

కాల్వ 80వ కిలోమీటర్​వద్ద వెడల్పు చేసి ఓ రిజర్వాయర్​ను నిర్మించనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తీసుకొచ్చే నీళ్లను సాగర్​ కుడికాల్వ రిజర్వాయర్​లోకి ఎత్తిపోసి.. ఆ తర్వాత 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్​కు తరలిస్తారు. అక్కడి నుంచి బనకచర్లకు టన్నెల్స్, లిఫ్టుల ద్వారా తీసుకెళ్తారు. 

అయితే, కృష్ణా జలాల్లో ఇప్పటికీ నీటి వాటాలు తేలకపోవడం, ట్రిబ్యునల్​లో వాదనలు జరుగుతుండడంతో.. కృష్ణా ద్వారా లింక్​ చేయడం మన రాష్ట్రానికి నష్టం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా డెల్టా సిస్టమ్​కు పట్టిసీమ (గోదావరి–కృష్ణా లింక్​) ద్వారా 45 టీఎంసీల వరకు ఏపీ నీటిని తరలిస్తోంది. ఆ మేరకు కృష్ణా జలాల్లో వాటా ఇవ్వాలని మన రాష్ట్రం వాదిస్తోంది. 

అయితే, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలోకి పోలవరం నీటిని ఎత్తిపోస్తే కేడీఎస్​నీటి వాటాల్లోనూ తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు సాగర్​జలాలకు సంబంధించి కుడి కాల్వ ద్వారా ఇష్టమొచ్చినట్టు నీటిని తోడేస్తున్న ఏపీ.. బనకచర్ల ప్రాజెక్టులో కుడి కాల్వకు లింక్​ చేస్తే గోదావరి పేరు చెప్పుకుని కృష్ణా వాటర్​నూ పెన్నా బేసిన్​కు డైవర్ట్​చేసే ప్రమాదమూ ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

అదీగాక సాగర్​స్పిల్​వే ద్వారా విడుదల చేసే నీటినీ అక్రమంగా బనకచర్ల లిఫ్ట్​కు మళ్లించుకునే కుట్రలు జరుగుతున్నాయన్న చర్చ కూడా నడుస్తోంది. రెండో దశలో జీఎస్​లింక్​చేపడ్తే 150 టీఎంసీల సామర్థ్యం ఉన్న బొల్లపల్లి రిజర్వాయర్​ను 300 టీఎంసీలకు పెంచే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.


మిగులు జలాలని చెబుతున్నా..

గోదావరిలోని మిగులు జలాలనే బనకచర్ల ప్రాజెక్టుకు తరలిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, అసలు ఆ మిగులు జలాలను కూడా వాటాలు తేల్చకుండా వాడుకోవడానికి లేదు. రాష్ట్ర విభజన తర్వాత గోదావరిపై 1,486 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించగా.. అందులో తెలంగాణకు 968, ఏపీకి 518 టీఎంసీలను కేటాయించారు. 

అసలు మిగులు జలాలు ఎన్ని ఉన్నాయన్న దానిపైనా పక్కా లెక్కలు తీయలేదు. మిగులు జలాల లెక్క తేలకుండా రెండు రాష్ట్రాల వాటాలనూ తేల్చలేని పరిస్థితి. అలాంటప్పుడు మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టును ఎట్ల చేపడతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటు కృష్ణాలోనూ వాటాలు తేలకుండా ప్రాజెక్టును చేపట్టడమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ట్రిబ్యునల్​లో రాష్ట్రాల వాటాను తేల్చే సెక్షన్​3పై వాదనలు వినాలని మనం వాదిస్తుంటే.. కాదు ముందు ప్రాజెక్టుల వారీ కేటాయింపులపైనే తేల్చాలని ఏపీ పట్టుబడుతున్నది. దానికి కారణమూ ఇట్లాంటి జీబీ లింక్​ ప్రాజెక్టులేనన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టుల వాటాను తేలిస్తే లింక్​లు చేపట్టి ప్రాజెక్టుల వారీగా కృష్ణా నీటిని తరలించుకోవాలన్న కుట్రలో భాగంగానే ఆ వాదనను ఏపీ తెరపైకి తీసుకొచ్చిందన్న సందేహాలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ హయాంలోనే అన్ని నష్టాలు..

రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతున్నట్టు బీఆర్ఎస్​ఇప్పుడు హాహాకారాలు చేస్తున్నది గానీ.. వాస్తవానికి రాష్ట్రానికి అన్యాయం జరిగింది కేసీఆర్​హయాంలోనేనని ఇరిగేషన్​ఎక్స్​పర్ట్స్​గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల (66:34) మేర నీటి కేటాయింపులపై ఒప్పందం జరిగింది 2015లోనే! నాడు సీఎంగా ఉన్న కేసీఆర్,  ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుతో కలిసి కేంద్రం సమక్షంలో ఈ ఒప్పందం చేసుకున్నారు. 

అక్కడ కూడా చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గే ఆయా వాటాలకు ఒప్పుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆ వాటాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని మార్చాలని కేసీఆర్​గానీ, బీఆర్ఎస్​గానీ ఏనాడూ గొంతెత్తి అడిగింది లేదు. అంతేకాదు.. శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా చేపట్టిన ముచ్చుమర్రి సామర్థ్యం కూడా కేసీఆర్, చంద్రబాబుల హయాంలోనే పెంచారు. రోజూ 3,500 క్యూసెక్కులను డ్రా చేసుకునేలా ఉన్న ముచ్చుమర్రి కెపాసిటీని 2017లో 6,500 క్యూసెక్కులకు ఏపీ పెంచుకున్నది. ఆ తర్వాత జగన్​ వచ్చాక 2020లో శ్రీశైలం ఆధారంగా చేపట్టిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్​ హెడ్​ రెగ్యులేటర్​సామర్థ్యాన్ని 44,600 వేల క్యూసెక్కుల నుంచి లక్షన్నర క్యూసెక్కులకు పెంచారు. 

రాయలసీమ లిఫ్ట్​ద్వారా రోజూ 3 టీఎంసీలను శ్రీశైలం డెడ్​స్టోరేజీ నుంచి తీసుకెళ్లేందుకు కుట్రలకు తెరలేపారు. అప్పుడు మన సీఎంగా ఉన్నది కేసీఆరే. రాయలసీమ లిఫ్ట్​ను అపెక్స్​కౌన్సిల్​ మీటింగ్​లో ఆపే అవకాశం ఉన్నా.. కేసీఆర్​ మీటింగ్​ను వాయిదా వేయించారు. ప్రాజెక్టుకు టెండర్లు పిలిచాక మీటింగ్​కు ఏర్పాట్లు చేశారు. ఇక, శ్రీశైలం ప్రాజెక్టు నుంచే బనకచర్లకు (పోతిరెడ్డిపాడు ద్వారా) నీటిని తరలిస్తున్న ఏపీ.. అది చాలదన్నట్టు ఇప్పుడు గోదావరి నదిపై ఉన్న పోలవరం నుంచి బనకచర్లకూ కృష్ణా ద్వారా నీటిని డైవర్ట్​ చేసి కృష్ణా జలాల్లో తెలంగాణకు కోతలు పెట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నదన్న చర్చ జరుగుతున్నది. 

ట్రిబ్యునల్​లో వాదనలు..

కృష్ణా జలాల వాటాపై ఇప్పుడే అసలు వాదనలు మొదలయ్యాయి. గంపగుత్త జలాల్లో రాష్ట్రాల వాటాలను తేల్చేందుకు కృష్ణా వాటర్​డిస్ప్యూట్స్​ట్రిబ్యునల్​2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రజేశ్​కుమార్​ట్రిబ్యునల్​)లో తెలంగాణ వాదనలు వినిపిస్తున్నది. వాస్తవానికి ఇప్పుడు మనం లిఫ్టుల మీద ఆధారపడుతు న్నాం గానీ.. హైదరాబాద్​ స్టేట్​లో ఆ లిఫ్టు లన్నీ గ్రావిటీ ప్రాజెక్టులుగానే ప్లాన్​ చేశా రని మన రాష్ట్రం ట్రిబ్యునల్​కు చెప్తున్నది. 

హైదరాబాద్​ స్టేట్ ​ఏపీలో విలీనం జరిగి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డాక.. అప్పటి పాల కులు కావాలనే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టారన్న ఆరోపణలు తీవ్రమవుతు న్నాయి. ఆ ప్రాజెక్టులను నిర్మించకుండా ఏపీలో ఆఫ్​లైన్​ స్టోరేజీలు పెంచుకుని కృష్ణా నీటిని దండుకున్నారన్న వాదనలు ఉన్నాయి. అప్పుడే మన ప్రాజెక్టులు కట్టి ఉంటే ఆ ప్రాజెక్టుల ఆధారంగా కేటా యింపులు వచ్చి ఉండేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అసలు ఇన్​బేసిన్​అవస రాలు తీరకుండా.. ఔట్​ బేసిన్​కు నీటి ని ఎట్ల తరలిస్తారన్న వాదనలూ విని పిస్తున్నాయి. ఇదే క్రమంలో ట్రిబ్యునల్​ముందు కావేరి ట్రిబ్యునల్​ వాటాలకు సంబంధించి (తమిళనాడు, కర్నాటక మధ్య) సుప్రీం కోర్టు.. కేవలం ఇన్​బేసిన్​అవసరాలకే నీళ్లిచ్చేలా 2 రాష్ట్రాలకు నీటి వాటాలపై తీర్పునిచ్చిన విషయాన్ని కృష్ణా ట్రిబ్యునల్​ముందు మన సర్కారు వినిపిస్తున్నది.