![కృష్ణా జలాల పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్](https://static.v6velugu.com/uploads/2025/02/krishna-water-dispute-lets-not-injustice-happen-to-telangana-says-minister-uttam_z7hy1wqoYu.jpg)
కృష్ణా జలాల పంపకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు.
కృష్ణా నదీ జలాల కేటాయింపు విషయమై ఏపీ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ గురువారం(ఫిబ్రవరి 13) సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మట్లాడిన ఆయన.. విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసిందని తెలిపారు. ఈ నెల 25వ తేదీ కల్లా అన్ని వాదనలపై షార్ట్ నోట్స్ సమర్పించాలన్నారని అన్నారు. నేటి సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వం వాదనలకు మద్దతుగా నిలిచిందని, ఇది రాష్ట్ర హక్కులను రక్షించడంలో ముందడుగు అని తెలిపారు.
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు చేపట్టాలని ఏపీ వాదిస్తుండగా.. నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్-3 ప్రకారంగా తొలుత గంపగుత్త కేటాయింపుల్లో వాటాలు తేల్చాలని పేర్కొంటూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఆ గెజిట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది.