
శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ నీటి కోసం పోతిరెడ్డిపాడు తూముకు పర్మిషన్ ఇస్తే, దాన్ని పదిరెట్లకు పెంచి సొరంగంలా మార్చి ఏటా వందల టీఎంసీలను పట్టుకెళ్తున్న ఏపీ పాలకులు బనకచర్లపై నిజాలు చెప్తున్నారంటే ఎట్లా నమ్మాలన్న ప్రశ్న తలెత్తుతోంది. బనకచర్ల పేరుతో కొత్త ప్రాజెక్టుగా చెబుతున్నా ఇప్పటికే రాయలసీమలో శ్రీశైలం మెయిన్ కెనాల్‌పై బనచకర్ల రెగ్యులేటర్ ఉందన్నది వాస్తవం. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా మళ్లిస్తున్న కృష్ణా నీళ్లు బనకచర్ల ద్వారానే సీమలో పలు ప్రాంతాలకు పోతున్నాయి.
ఇంత కీలకంగా ఉన్న బనకచర్లకు, ఎక్కడో పోలవరం నుంచి లింకు కలుపుతామని చెప్పడమే తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోంది. కేంద్రంలో టీడీపీ బలం మీదే ఎన్డీయే సర్కార్ ఆధారపడి ఉండడంతో ఈ ప్రాజెక్టుకు పర్మిషన్లు, సాయం తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కేంద్ర సాయంతో రూ.80వేల కోట్లతో ఏపీలో 240 కిలోమీటర్ల పొడవునా లిఫ్టులు, టన్నెళ్లు, కెనాల్స్ తో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఇక్కడ చంద్రబాబు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. నిజానికి ఏ నది నీళ్లయినా ఆ నది పరీవాహ ప్రాంతం (బేసిన్)లోనే ఉపయోగించుకోవాలన్నది అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ నిబంధనలు చెప్తున్నాయి. దీనికి విరుద్ధంగా దశాబ్దాలుగా తెలంగాణ హక్కులకు గండి కొడుతూ కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారు.
నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదలు నేటి ఏపీ పాలకుల దాకా పోతిరెడ్డి పాడు పేరుతో శ్రీశైలానికి బొక్కగొట్టి ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్) ద్వారా సీమకు నీటిని తోడుకెళ్తున్నారు. ఈ అక్రమాన్నే తెలంగాణ ప్రజలు మొదటి నుంచీ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన పదేండ్ల తర్వాత ఇప్పుడు కృష్ణాలో తెలంగాణ అసలైన హక్కు నీళ్ల కోసం బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయమైన వాటాలపై ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది.
దీంతో ఎప్పటికైనా ప్రమాదమే అని తెలిసి ప్రత్యామ్నాయంగా ఏపీ సర్కారు బనకచర్ల లింకును తెరపైకి తెచ్చినట్లు అర్థమవుతోంది. గోదావరి వరద మళ్లింపు పేరుతో కృష్ణా నీటి దోపిడీకి ముసుగేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో నీటిదోపిడీ గురించి తెలంగాణ మాట్లాడినా తాము గోదావరి నుంచే తెచ్చుకుంటున్నామని వాదించే అవకాశముంది.