ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై విచార‌‌‌‌‌‌‌‌ణ

ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై విచార‌‌‌‌‌‌‌‌ణ
  • సెక్షన్​ 3పై కేంద్ర గెజిట్​ను కొట్టేయాలని ఏపీ పిటిషన్​

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వాటాలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్​ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీ కేటాయింపులను చేపట్టాలని ఏపీ వాదిస్తుండగా.. నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్​3 ప్రకారంగా తొలుత గంపగుత్త కేటాయింపుల్లో వాటాలు తేల్చాలని పేర్కొంటూ కేంద్రం గెజిట్​ను విడుదల చేసింది. ఆ గెజిట్​ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. 

తాజాగా దానిపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఇటు కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ 2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​) కూడా సెక్షన్​3పైనే తొలుత వాదనలు వింటామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో విచారణకు ప్రాధాన్యం సంతరించుకున్నది. కాగా, వచ్చే రెండు వారాలు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో కోర్టు కేసులతో బిజీబిజీగా గడపనుంది. ఈ నెల 25వ తేదీ వరకు వివిధ అంశాలపై కోర్టుల్లో విచారణ జరగనుంది. 

సెక్షన్​3పై 19 వ తేదీ నుంచి 21వరకు బ్రజేశ్ కుమార్​ ట్రిబ్యునల్​వాదనలు విననుంది. సెక్షన్​ 3పైనే తొలుత వాదనలు వినాలన్న తెలంగాణ డిమాండ్​కే ట్రిబ్యునల్​ఇటీవల మొగ్గు చూపించిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలోని సెక్షన్​ 89పై వాదనలు వినేదాని కన్నా ముందు.. నదీ జలాల్లో గంపగుత్త వాటాల్లో కేటాయింపులపైనే విచారణ జరగడం కరెక్ట్​ అని ట్రిబ్యునల్​ పేర్కొంది.