- జూరాలలో ఒక యూనిట్ లో విద్యుదుత్పత్తి ప్రారంభం
గద్వాల, వెలుగు: కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి జలాశయానికి కృష్ణా జలాలు పోటెత్తుతున్నది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి దిగివకు నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారమే ఆల్మట్టి గేట్లు ఓపెన్ చేయగా బుధవారం నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం గురువారం నాటికి జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆల్మట్టికి 81,333 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా వస్తుండగా 65 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్ డ్యామ్ కు వదులుతున్నారు.
ఆల్మట్టి పూర్తి కెపాసిటీ 123 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 99 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయం పూర్తి కెపాసిటీ 33 టీఎంసీలుల కాగా, ప్రస్తుతం 31 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా.. 62,955 క్యూసెక్కుల నీటిని దిగివకు వదులుతున్నారు. జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.9 టీఎంసీల నీళ్లున్నాయి.
ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తున్నది. నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, భీమా-1కి 1,300 క్యూసెక్కులు, భీమ-2కి 841 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ కు 560 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కర్నాటక ప్రాజెక్టుల నుంచి కృష్ణ నదిలో వరద వస్తున్నాడంతో బుధవారం సాయంత్రం జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు దగ్గర 7,500 క్యూసెక్కుల నీటిని వాడుకుంటూ ఒక యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులో మొత్తం ఏడు విద్యుదుత్పత్తి యూనిట్లు ఉన్నాయి. ప్రాజెక్టుకు వరద పెరిగే కొద్ది ఒక్కొక్కటి చొప్పున మిగతా యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయనున్నారు.