నీటివాటా పాపం బీఆర్ఎస్​దే!

నీటివాటా పాపం బీఆర్ఎస్​దే!

జల వనరులు సమృద్ధిగా ఉంటేనే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా  కళకళలాడుతుందనేది జగమెరిగిన సత్యం.  తెలంగాణలో  నీటి  వనరులు  పుష్కలంగా ఉన్నా అనేక కారణాలతో ఈ ప్రాంతం వెనుకబడిందని మనకందరికీ తెలిసిందే. మన నీటి వాటా మనకు దక్కాలనే కోరిక బలంగా ఉండడంతో తెలంగాణ ఉద్యమంలో జలవనరుల అంశం కీలకపాత్ర పోషించింది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీరు మనకు లభిస్తుందని రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడియాశలయ్యాయి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి  కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయంగా దక్కాల్సిన నీటికోసం పోరాడకుండా కేసీఆర్ సర్కార్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. అంతర్జాతీయ నదీ ఒప్పందాల ప్రకారం నదీ పరీవాహకం ఎక్కువ ఉండే ప్రాంతానికి ఆ నదిలో అధిక వాటా దక్కడం న్యాయం. ఇప్పుడు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్లో  కృష్ణా జలాలపై జరిగే వాదనల్లో గతంలోవలె కాకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన వాటా దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 

కృష్ణా జలాలకు సంబంధించి 1973లో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించడంతో అన్యాయం జరిగింది.  అనంతరం  బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తీర్పులో ఉమ్మడి ఏపీకి 911 టీఎంసీలు  కేటాయించినా గెజిట్ జారీ చేయకపోవడంతో అమలులోకి రాలేదు.  తెలంగాణ ఏర్పడ్డాక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల బాధ్యతలను బ్రిజేశ్ ట్రిబ్యునల్​కు అప్పగించారు.  

తెలుగు రాష్ట్రాల మధ్య 2015లో  బీఆర్ఎస్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.  కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి లభించిన 811 టీఎంసీలలో సర్దుబాటు పేరుతో ఏపీకి 66 శాతం మేర అంటే 512 టీఎంసీలు, తెలంగాణకు 34శాతం మేర అంటే 299 టీఎంసీలు జలాలు కేటాయింపు ఆమోదానికి కేసీఆర్ సర్కార్ తలొగ్గి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది.

ఏపీకి అనుకూలంగా కృష్ణా నీటి కేటాయింపులు

50:50 శాతం నిష్పత్తిలో నీటి కేటాయింపులు ఉండాల్సి ఉండగా,  అన్యాయంగా ఏపీకి అనుకూలంగా 66:34  నిష్పత్తిలో కేటాయింపులు జరిగాయి.  ఇప్పుడు కూడా కేటాయింపులు అలాగే ఉండాలని ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుండడంతో,  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 555 టీఎంసీలు ఇవ్వాలని వాదిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పరీవాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. 

 ఆంధ్రప్రదేశ్ నుంచి  కృష్ణాజలాల్లో  న్యాయమైన వాటా దక్కించుకోవడంలో  పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. 2015 జూన్​లో  ఏపీతో కుదుర్చుకున్న ఆ  ఒప్పందం  తెరవెనుక కుట్రలు జరిగాయి.  కృష్ణా జలాల వాటా కేటాయింపులో అన్యాయం జరిగినా తాత్కాలిక కేటాయింపులపై సంతకాలు చేసిన ఉద్యమాల పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పోరాడలేదు? 

గోదావరి జలాల్లోనూ అన్యాయం

తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిలదీయడంతోనే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్(3) అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఒత్తిడితోనే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టర్మ్ స్​ ఆఫ్ రిఫరెన్స్ ను ఆమోదించింది. అంతేకాని ఇందులో బీఆర్ఎస్​కు ఎలాంటి పాత్ర లేదు.  

ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాటైన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పొడిగిస్తుంటే, నిమ్మకుండా కూర్చున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దిష్ట  కాల వ్యవధిలో న్యాయమైన కేటాయింపులు జరపాలని కేంద్రంపై ఒత్తిడి తేకపోవడంలో ఎలాంటి లోపాయికారి ఒప్పందం ఉంది?  బీఆర్ఎస్  పాలనలో  ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని అడ్డగోలుగా తరలించినా,  కృష్ణా బోర్డు,  అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే ఏపీ సర్కార్ శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభించినా, 80 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో  పోతిరెడ్డిపాడు విస్తరణకు రూ.6,829.15 కోట్లతో ఏపీ ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం   కళ్లప్పగిస్తూ చూస్తూ కూర్చుందే కానీ ఎలాంటి గట్టి చర్యలు చేపట్టలేదు.  

కృష్ణా జలాల్లోనే కాదు గోదావరి జలాల్లోనూ కేసీఆర్ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేసింది.  గోదావరి జలాలను రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ ఏ హోదాలో గొప్పలకు పోయి చెప్పారు?  రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యేవరకు అప్పటి సీఎం కేసీఆర్ అపెక్స్ మీటింగ్​కు  డుమ్మా కొట్టి రాష్ట్రం తరఫున గొంతెత్తలేదు.  బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకుండానే ఏపీ ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణకు పనులు చేపడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?  

రాష్ట్ర వాటా కోసం పోరాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

 రాష్ట్ర ప్రగతి కంటే  ప్రచారానికే అధిక ప్రాధాన్యతనిస్తూ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో  చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడుతూ, వాటి పనులను నిర్లక్ష్యం చేయడంతో అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి.  ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. 75 శాతానికి పైగా పనులు జరిగిన ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని, 50–75 శాతం పనులు జరిగిన వాటిని మూడేళ్లలో పూర్తి చేసి 6లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి తెచ్చేలా ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 

అన్యాయాలను సరిదిద్దుతున్న కాంగ్రెస్​ ప్రభుత్వం

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి రంగంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను ఒక్కొక్కటీ కాంగ్రెస్ సర్కార్  సరిదిద్దుతోంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నీటి పారుదలకు ప్రాధాన్యతనివ్వడమే కాకుండా, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునళ్ల ముందు వాదించేందుకు, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చేందుకు ఏమాత్రంవెనుకాడదు.    

ప్రతిపక్షంలో ఉండగా సెక్షన్ 3 కోసం ఒత్తిడి తెచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక అందుకు అనుగుణంగానే వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందించి ముందుకుసాగుతోంది.  తెలంగాణ  ప్రభుత్వం కోరుకున్నట్టే  బ్రిజేశ్ కుమార్  ట్రిబ్యునల్  సెక్షన్ 3 ప్రకారమే  కృష్ణాజలాల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని తాజాగా నిర్ణయించడం కాంగ్రెస్  ప్రభుత్వం సాధించిన విజయం.

కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

కేసీఆర్ సర్కార్ తీరుతో మహబూబ్​నగర్,  రంగారెడ్డి,  నల్గొండ, ఖమ్మం రైతులు నష్టపోతున్నా పట్టనట్టు వ్యవహరించారు.  రాష్ట్రానికి దక్కాల్సిన జలాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.  కృష్ణా జలాల్లో  తెలంగాణకు న్యాయంగా 70 శాతం వాటా రావాలని, భౌగోళికంగా నదీ పరీవాహక ప్రాంతానికి అనుగుణంగా,  అంతర్జాతీయ  నీటి ఒప్పందాల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం రేవంత్ రెడ్డి సర్కార్  పట్టుబడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.  

మరోవైపు 1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరానికి అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక నీటి హక్కులు సంక్రమిస్తాయి. దీంతో ఎగువన ఉన్న తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 45 టీంఎంసీల నీళ్లు ఇవ్వాలి.  పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏపీకి తరలిస్తున్న 80 టీంఎసీల్లో తెలంగాణ వాటా కింద 45 టీఎంసీలు రావాలి.  తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ఈ 90 టీంఎసీల జలాలను సాధించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో,  ఇప్పుడు  కాంగ్రెస్  ప్రభుత్వం ఈ వాటాలను దక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 

- బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు-