- నీళ్లు వచ్చినయి.. ఇక కాల్వలు కావాలె!
- 16 ఏళ్ల కల.. ఎట్టకేలకు ఉదయ సముద్రం- బ్రహ్మణవెల్లంల రిజర్వాయర్ లోకి కృష్ణా నీళ్లు
- ట్రయిల్ రన్ సక్సెస్ కావడంతో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
- మూడు నియోజవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు
- కాల్వలు కంప్లీట్ చేస్తే రైతాంగానికి మేలు
- సవాల్‌గా మారిన భూసేకరణ.. అప్రోచ్ కెనాల్లో పేరుకుపోయిన ఇసుక
నల్గొండ, వెలుగు ఉదయ సముద్రం-బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్ కు ఎట్టికేలకు నీళ్లొచ్చాయి. ఇక కాల్వలు కావాల్సి ఉంది. 16 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఈ ప్రాజెక్టు ట్రయల్‌రన్ సక్సెస్ కావడంతో స్థానిక రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. అన్ని సరిగా జరిగితే మరికొద్ది రోజుల్లో రిజర్వాయర్‌లోకి పూర్తిస్థాయిలో నీటిని నింపేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. నకిరేకల్, మునుగోడు, నల్గొండ నియోజకవర్గాలకు కలిపి మొత్తం లక్ష ఎకరాలకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో 2007లో అప్పటీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.699 కోట్ల పరిపాలన ఆమోదం లభించగా సాంకేతిక అనుమతులు రూ.535 కోట్లకు వచ్చింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిపి ఇప్పటి వరకు సుమారు రూ.400 కోట్లు ఖర్చు పెట్టాయి. మరో రూ.50కోట్లు భూసే కరణ కోసం రైతులకు చెల్లించారు. ఈ ఏడాది ఎన్నికలు ఉండటం వల్ల బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు పేరుతో ప్రజలకు వద్దకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా కొద్దిరోజుల కింద స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రిజర్వాయర్‌లోకి నీటిని వదిలే ప్రక్రియ షురూ చేశారు. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మూడు నియోజకవర్గాలు.. లక్ష ఎకరాలు
రిజర్వాయర్కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టు డిజైన్‌చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, శాలిగౌరారం మండలాల్లో 65 వేల ఎకరాలు కాగా, నల్గొండ నియోజకవ ర్గంలో 24 వేలు, మునుగోడులో 10,270 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. కానీ కుడి, ఎడమ కాల్వల పనులు పూర్తికాకపోవ డంతో ప్రస్తుతానికి రిజర్వాయర్ నింపే కార్యక్రమాన్ని చేపట్టారు.
పేటెంట్‌రైట్స్ కోసం పొలిటికల్ఫైట్!
కోమటిరెడ్డి బ్రదర్స్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వగ్రామం నార్కట్‌పల్లి బ్రహ్మణ వెల్లంల. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్సార్ సహకారంతో బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు శాంక్షన్ చేయించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్చేయాలని కోమటిరెడ్డి బ్రదర్స్బీఆర్ఎస్ ప్రభుత్వంపైన ఒత్తిడి చేశారు. కానీ ప్రాజెక్టు పూర్తిచేస్తే ఆ పేరు కోమటిరెడ్డి బ్రదర్స్ ఖాతాలో పడిపోతుందని ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్సపోర్ట్తో గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరడంతో మళ్లీ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి గెలుపునకు బీవెల్లంల రిజర్వాయర్ దోహదపడుతుందని భావించిన ప్రభుత్వం ఆగమేఘాల మీద ఫండ్స్ రిలీజ్ చేసి, ట్రయల్‌రన్ చేపట్టింది. ఎమ్మెల్యే ట్రయల్ రన్ మొదలు పెట్టగానే, నార్కట్‌పల్లిలోని కోమటిరెడ్డి వర్గం కౌంటర్ఇవ్వడం స్టార్ట్ చేసింది. రిజర్వాయర్ క్రెడిట్అంతా బ్రదర్స్‌కే దక్కుతుందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. దీనికి దీటుగా ఎమ్మెల్యే చిరుమర్తి సైతం త్వరలో సీఎం కేసీఆర్ చేతులో ప్రాజెక్టు ఓపెన్ చేయించి, ఎన్నికల్లో క్రెడిట్ కొట్టేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో అసలు రిజర్వాయర్ పేటెంట్‌రైట్స్ కోసం కోమటిరెడ్డి బ్రదర్స్, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య యుద్ధం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే వానాకాలంలో పంటల సాగు కోసం రిజర్వాయర్ లో నిల్వ చేసిన నీరు ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. రిజర్వాయర్ పరిధిలో గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు, బావుల్లో నీటి నిల్వలు పెరుగుతాయని అంటున్నారు. వంద శాతం ప్రాజెక్ట్ ఫుల్ షేప్ లోకి రావాలంటే ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేస్తే ఇంకో ఏడాది టైం పట్టొచ్చని ఇరిగేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ సమస్యలు తీరితేనే..
ప్రాజెక్టు డిజైన్ ప్రకారం లక్ష ఎకరాలకు సాగునీరందించాలంటే ప్రధానంగా పంపు హౌజ్ వద్ద రెండు మోటార్లు నడవాలి. ప్రస్తుతానికి ఒక్క మోటారు పనిచేస్తోంది. రెండో మోటరు నడవాలంటే అప్రోచ్ కెనాల్లో పేరుకుపోయిన ఇసుక తవ్వాల్సి ఉంది. 16 ఏండ్ల కింద తవ్విన అప్రోచ్ కెనాల్లో ప్రస్తుతం ఇసుక పేరుకపోయింది. ఒప్పందం మేరకు కాంట్రాక్టు సంస్థ ఇసుక తవ్వితే గానీ రిజర్వాయర్‌లోకి అనుకున్న ప్రకారం 0.3 టీఎంసీల నీరు చేరే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌లోని ఎడమ, కుడి కాల్వల పనులు, దాని కింద చేయాల్సిన 28 డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాలంటే భూసేకరణ చేయాల్సి ఉంది. కాల్వలకు బిగించాల్సిన రెగ్యులేటరీ గేట్స్పనులు పెండింగ్‌లో ఉన్నాయి. లెఫ్ట్ కెనాల్ 6.50 కిలో మీటర్లకు గాను 4 కిలో మీటర్లు, రైట్కెనాల్ 25.53 కిలోమీటర్లకు గాను ఆరు కిలోమీటర్లు తవ్వారు. కాల్వలు, రిజర్వాయర్ నిర్మాణం కోసం 3,880 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా, 1370 ఎకరాలు మాత్రమే సేకరించారు. కాల్వలు, భూసేకరణ కలిపి సుమారు రూ.404 కోట్లు అవసమరని అధికారులు ప్రపోజల్ పెట్టారు. రిజర్వాయర్‌పనులకు రూ.240 కోట్లు, భూసేకరణకు రూ.164 కోట్లు ఖర్చు పెడితే తప్ప లక్ష ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు.