బంగార్రాజు తర్వాత నాగచైతన్య, కృతిశెట్టి మరోసారి కలిసి నటించిన చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకుడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈనెల 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా కృతిశెట్టి ఇలా ముచ్చటించింది.
‘‘సినిమా అన్నాక విలన్‌ని అంతం చేయడానికి హీరో ట్రై చేయడం కామన్. కానీ ఇందులో మాత్రం కాపాడటానికి ట్రై చేస్తాడు. అదే ఆసక్తికరంగా ఉంటుంది. స్టోరీ సీరియస్ అవుతున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసే ఇంపార్టెంట్ క్యారెక్టర్‌ని పోషించా. డ్యురేషన్ తక్కువే అయినా నటనకు ప్రాధాన్యత గల పాత్ర. మంచి ఎమోషన్ కూడా వుంటుంది. క్యారెక్టర్ కోసం జిమ్నాస్టిక్స్ కూడా ప్రాక్టీస్ చేశా. అండర్ వాటర్ సీక్వెన్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం.15 రోజుల పాటు ఆ షూట్ జరిగింది. ఐదు రోజులైతే కంటిన్యూగా వాటర్‌లోనే ఉన్నాం. అందుకోసం రెండు రోజులు ట్రైనింగ్ తీసుకున్నాం. ఊపిరి తీసుకోకుండా రెండు నిమిషాలు పాటు వుంటేనే ఒక షాట్ సాధ్యం. ఒక దశలో చాలా భయమేసింది.
నాగచైతన్య నా అభిమాన నటుడే కాదు.. ఫేవరేట్ పర్సన్ కూడా. చాలా నిజాయితీగా ఉంటారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు చాలా ఫ్రెండ్లీ. సెట్స్‌లో నేను రౌడీలా ఉన్నానని ఆయన అనేవారు (నవ్వుతూ). పర్సనల్‌గా నేను కొంచెం రౌడీనే. ఏదైనా అవతలి వాళ్లు మనకిచ్చే కంఫర్ట్‌ని బట్టి ఉంటుంది. చైతుతో రెండోసారి కలిసి వర్క్ చేస్తున్నా కనుక ఆ కంఫర్ట్ ఉంది. అందుకే మా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది.
ఇక నా కెరీర్ విషయానికొస్తే... ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సినిమాతో పాటు ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నా. మరికొన్ని సినిమాలు ఉన్నాయి.. త్వరలోనే వాటిని నిర్మాతలు అనౌన్స్ చేస్తారు. కొత్తగా ఒక భాషలో పరిచయం కావాలంటే మంచి డెబ్యూ సినిమా చాలా ముఖ్యం. బాలీవుడ్ ఎంట్రీ విషయంలో అలాంటి ఓ మంచి కథ కోసం ఎదురుచూస్తున్నా’’ అని కృతిశెట్టి తెలిపింది.