బాడీ షేమింగ్ తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా కొందరు వినడం లేదు. వెనకా ముందూ ఆలోచించకుండా నోటికొచ్చిన కామెంట్స్ చేసి సెలెబ్రిటీస్‌ని ఇబ్బంది పెతున్నారు. తానూ ఆ సమస్యను ఫేస్ చేశానంటోంది కృతీసనన్. నేనొక్కడినే, దోచేయ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించాక.. బాలీవుడ్ వెళ్లి బిజీ అయిపోయింది కృతి. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలున్నాయి. వాటిలో మూడు భారీ బడ్జెట్ చిత్రాలు. తానీ స్థాయికి చేరుకోడానికి చాలా మాటలే పడ్డానంటోంది కృతి.
‘నేను అందంగా ఉండనన్నారు. నీ ముక్కు అలా ఉంది, మూతి అలా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. అది సరి చేసుకో, ఇది మార్చుకో, సర్జరీ చేయించుకో అంటూ సలహాలిచ్చినవాళ్లూ ఉన్నారు. మొదట్లో బాధపడినా తర్వాత పట్టించుకోవడం మానేశా. అలా పుట్టాను కాబట్టి అలానే ఉంటాను. మార్పులూ చేర్పులూ చేయడానికి నేనేం ప్లాస్టిక్ బొమ్మని కాదు’ అని ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యింది కృతి. నెగిటివ్ కామెంట్స్‌ని పట్టించుకోకుండా ముందడుగు వేస్తే సక్సెస్ గ్యారంటీ అంటోందామె. ఆ మాట ఎంత నిజమో తన కెరీర్ చూస్తే అర్థమవుతోంది.