- కేటాయించిన నీళ్లకన్నా 5శాతం ఎక్కువే తీసుకుంటున్నది
- ఉన్న టెలిమెట్రీలు పనిచేస్తలే..కొత్తవి పెడ్తలే
- నిర్వహణ పట్టించుకోని మెకట్రానిక్స్ సంస్థ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల వినియోగంపై ఏపీ చెప్పిందే లెక్కగా నమోదవుతున్నది. తెలంగాణ, ఏపీ మధ్య నీళ్ల పంపకాలు, వినియోగానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఏ ఔట్ లెట్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటిని తీసుకుందో లెక్కించడానికి ఏర్పాటు చేసిన టెలిమెట్రీ స్టేషన్లు సక్రమంగా పనిచేయడం లేదు.
ఐదేండ్లుగా టెలిమెట్రీలు సరైన ఫలితాలు ఇవ్వకున్నా బోర్డు వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. కొత్త టెలిమెట్రీ స్టేషన్ల కోసం నిధులు సమకూర్చినా వాటి ఏర్పాటుకు చొరవ చూపడం లేదు. 2017లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు నీటిని తీసుకునే 13 ప్రాంతాల్లో పుణెకి చెందిన మెకట్రానిక్స్ సిస్టమ్స్ సంస్థ రియల్ టైం డేటా అక్విజేషన్ నెట్ వర్క్ తో కూడిన నాన్ కాంటాక్ట్ రాడార్ వాటర్ లెవల్ సెన్సర్స్, ఐదు ప్రాంతాల్లో నాన్ కాంటాక్ట్ వెలాసిటీ అండ్ నాన్ కాంటాక్ట్ రాడార్ వాటర్ లెవల్ సెన్సార్లను ఏర్పాటు చేసింది.
ఇందుకోసం ఆ సంస్థకు కృష్ణా బోర్డు రూ.1.80 కోట్లు చెల్లించింది. ఐదేండ్ల పాటు వీటి నిర్వహణ కూడా సంబంధిత సంస్థనే చూడాల్సి ఉంటుంది. ఆ గడువు ఈనెల 28తో ముగియనుంది. కాంట్రాక్ట్ గడువు ముగియడానికి వస్తున్నా టెలిమెట్రీల నిర్వహణపై ఆ సంస్థ ఏమాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నది.
ఏపీ చెప్పేది తక్కువ.. తీసుకునేది ఎక్కువ..
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకునే నీటి లెక్కల్లో ఏపీ తరచూ తప్పుడు నివేదికలు ఇస్తున్నది. కేఆర్‌ఎంబీ ఫిజికల్ వెరిఫికేషన్‌లో ఈ విషయం పలుమార్లు తేటతెల్లమైంది. పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుంటున్నట్టుగా ఏపీ చెబుతున్న లెక్కలకు.. బోర్డు ఏడీసీపీ (అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైల్) ద్వారా చేసిన పరీక్షలకు తేడాలు ఉన్నాయి. ఇలా నిర్ధారణ అయిన సందర్భాల్లో మినహా మిగతా రోజుల్లో ఏపీ చెప్పిన వినియోగం లెక్కలనే బోర్డు పరిగణనలోకి తీసుకుంటున్నది.
2014 -– 15 వాటర్ ఇయర్ నుంచి 2021–- 22 వాటర్ ఇయర్ వరకు ఏపీ కృష్ణా నది నుంచి 3,695 టీఎంసీలు తీసుకోగా.. తెలంగాణ 1,638 టీఎంసీలకే పరిమితమైంది. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కృష్ణా జలాల కేటాయింపులు ఉండగా.. అందులో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా పంపకాలు చేశారు. 2014 -–15 వాటర్ ఇయర్‌లో కృష్ణా నీళ్లను 63 : 37 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాల్సింది. వరుసగా మూడేళ్లు తెలంగాణ కేటాయింపుల మేరకు నీటిని తీసుకోకపోవడంతో 2017 -18 వాటర్ ఇయర్‌లో నీటి వాటాలను 66 : 34 నిష్పత్తికి మార్చారు.
టెలిమెట్రీలపై బోర్డు నిర్లక్ష్యం
మొదటి దశ టెలిమెట్రీల్లో కృష్ణా నీళ్లల్లో ఎక్కువ వాటా తీసుకునే కెపాసిటీ ఉన్న ఏపీ ఔట్‌లెట్లపై కాకుండా, తెలంగాణలోనే ఎక్కువ ఏర్పాటు చేశారు. 18 టెలిమెట్రీల్లో కేవలం ఆరు స్టేషన్లు ఏపీలో ఉండగా.. 12 స్టేషన్లు తెలంగాణలో పెట్టారు. వీటిలో అత్యధిక టెలిమెట్రీ స్టేషన్లు సరిగా పనిచేయడం లేదు. అవి పనిచేసేలా మెకాట్రానిక్స్ కు ఆదేశాలివ్వాల్సిన కృష్ణా బోర్డు ఆ దిశగా ప్రయత్నించడం లేదు. మరోవైపు ఈ 18 స్టేషన్లకు అదనంగా రెండో దశలో 9 టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఇందుకు రూ.2 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొదట్లో వీటి ఏర్పాటుకు తెలంగాణ, ఏపీ నిధులు ఇవ్వడం లేదని కేఆర్‌ఎంబీ సాకులు చెబుతూ వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం కేఆర్‌ఎంబీకి తెలంగాణ రూ.6.50 కోట్లు, ఏపీ రూ.4.50 కోట్లు విడుదల చేశాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 3 కి.మీ.ల దిగువన శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్‌పై, సాగర్ ఎడమ, కుడి కాలువలపై, సాగర్ ఎడమ కాలువపై పాలేరుకు ఎగువన 136.34 కి.మీ.ల వద్ద, ఎడమ కాలువపై తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని 101.36 కి.మీ.ల వద్ద, పోలవరం కుడి కాలువపై, ప్రకాశం బ్యారేజీ వెస్ట్, ఈస్ట్ మెయిన్ కెనాళ్లపై, కర్నూల్ - కడప కెనాల్‌పై కొత్తగా టెలిమెట్రీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదట ఏర్పాటు చేసిన 18 టెలిమెట్రీ స్టేషన్లలో 7 స్టేషన్లను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నా కొత్త టెలిమెట్రీల ఏర్పాటుపై బోర్డు చర్యలు చేపట్టడం లేదు.