- తాగునీటి విడుదలకు కేఆర్ఎంబీ ఆమోదం
- జులై 31 వరకు ఈ కేటాయింపులే ఉంటాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటిని తీసుకునేందుకు తెలంగాణ, ఏపీలకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతినిచ్చింది. ఏపీకి 4.5 టీఎంసీలు, తెలంగాణకు 5.4 టీఎంసీల నీళ్లను కేటాయించింది. జులై 31 వరకు ఈ కేటాయింపులే ఉంటాయని స్పష్టం చేసింది. శ్రీశైలం, సాగర్ నీటి వినియోగంపై సోమవారం జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ.. తన తాగునీటి అవసరాల నిమిత్తం 7.5 టీఎంసీలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి 5 టీఎంసీలను సాగర్ కుడి కాల్వ ద్వారా విడుదల చేసుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా కొద్ది రోజుల కిందే కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. అయితే, సోమవారం నాటి మీటింగ్లో మాత్రం 7.5 టీఎంసీలు ఇవ్వాల్సిందిగా కేఆర్ఎంబీ ముందు ప్రతిపాదన పెట్టింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, చెరువుల్లోనూ నీళ్లు లేవని ఏపీ వాదించింది. ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరాకు నీటిని విడుదల చేయాలని కోరింది. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాగర్లో 500 అడుగులు, శ్రీశైలంలో 800 అడుగుల మినిమం డ్రా లెవెల్ నుంచి తీసుకోగలిగిన మేరకే అలాట్ చేయాలని వాదించారు. దీంతో సాగర్ నుంచి ఏపీకి 4.5 టీఎంసీలు, తెలంగాణకు 5.4 టీఎంసీల నీళ్లను కేఆర్ఎంబీ కేటాయించింది. జులై 31 వరకు ఈ కేటాయింపులే ఉంటాయని తేల్చి చెప్పింది.
హైదరాబాద్, ఖమ్మంకు తాగునీటి సరఫరా
తెలంగాణకు కేటాయించిన నీటి వాటాతో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. కాగా, ఈ కేటాయింపులు ఈ నెల 31 వరకు సరిపోతాయని, ఇప్పటికే ఎగువన కృష్ణా ప్రాజెక్టులకు వరద మొదలైన నేపథ్యంలో నీటికి ఇబ్బంది ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా, శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తికి 6 టీఎంసీలను విడుదల చేసేందుకు కేఆర్ఎంబీ ఓకే చెప్పింది. రెండు రాష్ట్రాలు చెరి 3 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఆమోదం తెలిపింది.