
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ముదురుతోంది. శ్రీశైలంలో స్థాయికి మించి ఏపీ నీటిని తరలించుకుపోయిందని వాదిస్తున్న తెలంగాణ..ఏపీ కోటాలో మిగిలింది 27 టీఎంసీలే.. అలాంటప్పుడు 34 టీఎంసీలు ఎట్ల అడుగుతారని ప్రశ్నించింది. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన వాటాకు మించి వాడుకుందని, శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడున్న నీటిని కేవలం తెలంగాణకే ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు.
ఏపీకి ఈ వాటర్ ఇయర్లో 666 టీఎంసీల నీటిని కేటాయించగా.. 639 టీఎంసీలు వాడేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ నీటిని తెలంగాణ అవసరాలు తీర్చేందుకే ఉంచాలి” అని స్పష్టం చేశారు. . శ్రీశైలంతో పాటు ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా ఏపీ నీటిని తరలించకుండా నియంత్రించాలని బోర్డును డిమాండ్ చేశారు.
ఏపీ ఆయకట్టుకు ప్రస్తుతం నీటి అవసరం ఉందని ఆ రాష్ట్ర అధికారులు కృష్ణా బోర్డుకు తెలియజేశారు. ఆయకట్టు ఎండిపోకుండా చూడాలన్నారు. ఫిబ్రవరి అవసరాలకు 16 టీఎంసీలు, మార్చి అవసరాలకు 18 టీఎంసీలు ఇవ్వాలని బోర్డుకు ఏపీ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఎక్కువ నీటిని తీసుకుపోయిన నేపథ్యంలో మళ్లీ ఆయకట్టుకు నీటిని ఎట్ల తీసుకెళ్తారంటూ తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.