- ఇరు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం స్పిల్ వేకు అత్యవసరంగా రిపేర్లు చేయాలని, ఇందుకోసం రూ. 800 కోట్ల అవసరమని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఇరు రాష్ట్రాలకు తెలిపింది. మే 6న బోర్డు 16వ సమావేశం నిర్వహించనున్నట్లు మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురే మంగళవారం లేఖ రాశారు. జలసౌధలో ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల స్పెషల్ సీఎస్‌లు, ఈఎన్సీలను కోరారు.
శ్రీశైలం డ్యాం సేఫ్టీకి తీసుకోవాల్సిన చర్యలను ఇరు రాష్ట్రాలకు పంపిన మీటింగ్ ఎజెండాలో స్పష్టం చేసింది. భారీ వరదల కారణంగా శ్రీశైలం స్పిల్ వే దిగువ భాగంలో 40 మీటర్ల లోతైన ప్లంజ్ గుంత ఏర్పడిందని, దాన్ని పూడ్చడంతో పాటు రక్షణ గోడ నిర్మాణం చేయాలని పేర్కొంది. దీనికి రూ. 800 కోట్ల ఖర్చవుతుందని చెప్పింది. అలాగే నాగార్జున సాగర్ స్పిల్ వే దిగువ భాగంలో గ్యాప్ ఏర్పడిందని, దాన్ని వెంటనే లెవెల్ చేయాలని తెలిపింది.
డ్యామ్ గ్యాలరీ, సీపేజ్ హోల్స్ లోనూ లోపాలున్నట్లు వివరించింది. ఇవి సరి చేయాలంటే రూ. 10 కోట్ల అవసరమని కోరింది. మరోవైపు పులిచింత స్పిల్ వే రిపేర్లకు రూ. 10 కోట్లు అవసరమని వెల్లడించింది. ఇక సమావేశంలో రెండు రాష్ట్రాల్లోని ఆమోదం పొందని ప్రాజెక్టుల డీపీఆర్‌లు, పవర్ జనరేషన్, డ్యాం సేఫ్టీ, బోర్డు జ్యూరిస్‌డిక్షన్ అమలు, హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు షిఫ్టింగ్, బోర్డుకు రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు కేఆర్ఎంబీ పేర్కొంది.