
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రిజర్వాయర్లయిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించాలని, అప్పుడే రాష్ట్రాల నీటివాటాలను పంచేందుకు అవకాశముంటుందని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలంగాణను కోరింది. ఈ మేరకు తెలంగాణ సర్కారుకు తాజాగా లేఖ రాసింది. ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఏపీ ఇష్టారాజ్యంగా జలాలను తరలించుకుపోతున్నదని, ఫలితంగా తెలంగాణ ఆయకట్టుకు, హైదరాబాద్ తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని తెలంగాణ సర్కారు ఇప్పటికే బోర్డుకు పలుసార్లు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ తాజాగా స్పందించింది. రివర్ బోర్డు గెజిట్‌కు అనుగుణంగా ఉమ్మడి ప్రాజెక్టుల ఔట్‌లెట్లను బోర్డుకు స్వాధీనం చేయాలని, తద్వారా జలాల వినియోగాన్ని నియంత్రించే అవకాశముంటుందని తెలిపింది. ప్రాజెక్టుల స్వాధీనానికి ఏపీ సుముఖంగా ఉందని, తెలంగాణే అంగీకరించడం లేదని వివరించింది. ఇప్పటికైనా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణకు సూచించింది. అదేవిధంగా గత ఫిబ్రవరిలో నిర్వహించిన బోర్డు అత్యవసర సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటివినియోగానికి సంబంధించి ప్రతీ 15రోజులకు ఒకసారి సమావేశమై చర్చించుకుంటామని ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు నిర్ణయించుకున్నారని గుర్తుచేసింది.