KRMB సమావేశానికి ఏపీ డుమ్మా.. ఏపీ తీరుపై బోర్డు తీవ్ర ఆగ్రహం

KRMB సమావేశానికి ఏపీ డుమ్మా.. ఏపీ తీరుపై బోర్డు తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్: KRMB సమావేశానికి ఏపీ హాజరు కాకపోవడంపై బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డుపై కనీసం గౌరవం లేదా అంటూ KRMBని తెలంగాణ ప్రశ్నించింది. బోర్డు కూడా ఏపీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకుని.. ఇప్పుడు ఏపీ తరపు అధికారులు రాకపోవడంలో ఆంతర్యం ఏంటని తెలంగాణ నిలదీసింది. గురువారం ఉదయం 11 గంటలకు మరోసారి KRMB సమావేశం జరగనుంది.

శ్రీశైలం నుంచి ఏపీలోని మల్యాల, పోతిరెడ్డిపాడు, ముచ్చిమర్రి నుంచి నీళ్ల తరలింపు ఆపాలని తెలంగాణ డిమాండ్ చేసింది. శ్రీశైలం నీళ్లను ఏపీ ముట్టుకోవద్దని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ ముందు తేల్చి చెప్పారు. ఏపీకి సాగర్ కుడి కాలువ నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించాలని KRMB బోర్డు ముందు తెలంగాణ గట్టిగా వాదించింది.

కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్​ఇప్పటికే తన వాటాకు మించి వాడుకున్నదని, శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడున్న నీటిని కేవలం తెలంగాణకే ఇవ్వాలని కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ‘‘ఏపీకి ఈ వాటర్​ఇయర్లో 666 టీఎంసీల నీటిని కేటాయించగా.. 639 టీఎంసీలు వాడేసింది. శ్రీశైలంలో స్థాయికి మించి నీటిని తరలించుకుపోయింది.

ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్​ నీటిని తెలంగాణ అవసరాలు తీర్చేందుకే ఉంచాలి” అని స్పష్టం చేశారు. శ్రీశైలంతో పాటు ఇటు నాగార్జునసాగర్​ ప్రాజెక్టు నుంచి కూడా ఏపీ నీటిని తరలించకుండా నియంత్రించాలని బోర్డును డిమాండ్​ చేశారు. ఏపీ కోటాలో మిగిలింది 27 టీఎంసీలేనని, అలాంటప్పుడు 34 టీఎంసీలు ఎట్ల అడుగుతారని ప్రశ్నించారు.

సోమవారం(ఫిబ్రవరి 24, 2025) జలసౌధలో తెలంగాణ, ఏపీ అధికారులతో కేఆర్ఎంబీ చైర్మన్​ అతుల్​ జైన్​ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. సెక్రటరీల స్థాయిలో నిర్వహించిన ఈ మీటింగ్కు ఏపీ ఇరిగేషన్​సెక్రటరీ హాజరు కాలేదు. 

తెలంగాణ తరఫున ఇరిగేషన్​ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్​బొజ్జా, ఈఎన్సీ అనిల్​కుమార్, ఇంటర్​స్టేట్ వాటర్ రీసోర్సెస్​అధికారులు, ఏపీ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్సీ వెంకటేశ్వర్​రావు, అధికారులు హాజరయ్యారు. ఇటు తెలంగాణ ఈఎన్సీ, ఏపీ ఈఎన్సీ కూడా బోర్డు మీటింగ్​అనంతరం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.