ఏపీ ప్రాజెక్టుల బండారం బయటపెట్టిన కేఆర్ఎంబీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి యధేచ్చగా రాయలసీమ ప్రాజెక్టు చేపట్టి చాలా వరకు పూర్తి చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీ కోసం పేరుతో చకచకా పనులు చేపట్టి చాలా భాగం పూర్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సంగమేశ్వరం వద్ద ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్యుల బృందం ఈనెల 11న పరిశీలించిన విషయం తెలిసిందే. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యదర్శి రాయపురే, సభ్యులు మౌతంగ్, తరపున కేంద్ర జలశక్తి సంఘం తరపున దర్పన్ తల్వార్ తదితర నిపుణనుల బృందం సంగమేశ్వరం ప్రాంతంలో సందర్శించి ఏపీ చేపట్టిన ప్రాజెక్టు పనులను తనిఖీ చేసింది. పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. 
ఈ క్రమంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పించేందుకు సంగమేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన నివేదికను కేఆర్ఎంబీ రెడీ చేసినట్లు సమాచారం. ఎన్జీటీ ఆదేశాలలో ఫీల్డ్ విజిట్ చేసిన రిపోర్ట్ ఇచ్చిన కేఆర్ఎంబీ ఆరోపణలు నిజమేనని నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఏపీ అక్రమ ప్రాజెక్టుల బండారం బయటపెట్టింది కేఆర్ఎంబీ. సంగమేశ్వరం వద్ద కృష్ణా నది నుంచి 800 అడుగుల లెవెల్ కు అప్రోచ్ ఛానెల్ పనులు 30 శాతం పూర్తయ్యాయని, డీపీఆర్ తయారీకి మించి పనులు చేసినట్లు నిర్ధారించుకుంది. చాలా వరకు నీట మునగడంతో సరైన ఉజ్జాయింపుగా నిర్దారించినట్లు సమాచారం. పంప్ హౌస్ ల కోసం 730 అడుగుల లోతుకు తవ్వకాలు జరిపినట్లు గుర్తించామని, మేం విజిట్ చేసిన సమయంలో ఎలాంటి పనులు జరగడం లేదని, పెద్ద చిన్న కంకర, ఇసుక నిల్వలు రెడీగా ఉన్నాయని, ప్రాజెక్టు ప్రాంతంలో రెండు బ్యాచింగ్ ప్లాంట్లు ఉన్నాయని కేఆర్ఎంబీ ఎన్జీటీకి వివరిస్తూ నివేదిక రెడీ చేసినట్లు సమాచారం.