ఆర్టీసీ కార్మికులను డీఎం వేధిస్తుండు .. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్​కు కార్మికుల మొర

ఆర్టీసీ కార్మికులను డీఎం వేధిస్తుండు .. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్​కు కార్మికుల మొర

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికులను వేధిస్తున్న డిపో మేనేజర్ విశ్వనాథ్​ను సస్పెండ్ చేయాలని, కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత కేఎస్ రావు డిమాండు చేశారు. సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్​ను కరీంనగర్​లోని క్యాంప్​ఆఫీస్​లో కలిసి వినతి పత్రం అందజేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆసిఫాబాద్ డిపోలో పనిచేస్తున్న కార్మికులపై మేనేజర్​ పనిభారం పెంచి వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీసులను నడిపితే మూడ్రోజుల పని దినాలుగా గుర్తించాల్సి ఉండగా రెండ్రోజులకు కుదించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో పనిచేయని మెషీన్​తో టెస్టులు చేస్తూ కార్మికులపై తప్పుడు నివేదికలు ఇచ్చి సస్పెండ్ చేయడం, సర్వీస్ నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. రెండు సంవత్సరాల్లో 216 మంది కార్మికులను సస్పెండ్, రిమూవ్ చేశారని తెలిపారు. డీఎంను సస్పెండ్ చేయాలని, ఆర్​ఎంను ట్రాన్స్​ఫర్​ చేయాలని కోరారు. ఇందుకు బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించారని, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారని ఏమాజీ తెలిపారు. బీజేపీ నేత కేశవరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.