
మరాఠి, కన్నడ భాషా వివాదం మరోసారి తీవ్రమైంది. డ్యూటీలో ఉన్న KSRTCకి చెందిన బస్సు కండక్టర్ పై కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. శనివారం (ఫిబ్రవరి 22) జరిగిన ఈ ఘటనలో మహారాష్ట్ర, కర్ణాటక హధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేశారు.
ఓ ప్రయాణికుడు మరాఠీలో టికెట్ అడిగి..తనకు ప్రయాణం ఉచితం కాబట్టి తాను టికెట్ అడగలేదని చెప్పడంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది. KSRTCకి చెందిన కండక్టర్ మహాదేవ్ హుక్కేరి తనకు మరాఠీ అర్థం కాలేదని,కన్నడలో మాట్లాడాలని కోరడంతో గొడవ మరింత ముదిరింది. కండక్టర్, మరికొంత మంది మరాఠి మాట్లాడే ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
బాలేకుండ్రి అనే ప్రాంతానికి చేరుకున్న తర్వాత వివాదం మరింత ముదిరింది. గమ్యస్థానం చేరుకున్నాక పెద్ద గుంపు బస్సులో ప్రవేశించి కండక్టర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మరాఠీలో మాట్లాడనందుకు కండక్టర్ ను చెంపదెబ్బలు కొట్టి ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారు. కండక్టర్ పై దాడికి సంబంధించిన వీడియో బెలగావిలోని సోషల్ మీడియాలో ప్లాట్ ఫాంలో వైరల్ అయింది.
ఈ వీడియోలో కండక్టర్ హుక్కేరి తనను వదిలిపెట్టమని వేడుకున్నా దాడి చేసినట్లు కనిపిస్తోంది. దాడిలో హుక్కేరి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. చికిత్సకోసం అతనిని బెళగావి సివిల్ ఆస్పత్రికి తరలించారు. భయంకరమైన ఆ దాడిని గుర్తు చేసుకొని కండక్టర్ కన్నీటి పర్యంతం అయ్యారు.
ఈ దాడిపై వివిధ కన్నడ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దాడి చేసిన వారిపై పోలీసులు,రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నడ మాట్లాడే వ్యక్తులు ,ప్రభుత్వ ఉద్యోగుల భద్రతను నిర్ధారించడానికి కఠినమైన చర్యలు అవసరమని అంటున్నారు.