- నాతో పాటు బీఆర్ఎస్ నేతలంతా రెడీ : కేటీఆర్
- రాష్ట్రంలో ఏదో ఉద్ధరించినట్లు ఢిల్లీలో రేవంత్ గొప్పలు చెప్పిండు
- ఆరు గ్యారంటీలు అని చెప్పి అర గ్యారంటీ అమలు చేస్తుండు
- నన్ను 37 రోజులు కాదు 370 రోజులు జైల్లో పెట్టుకో.. భయపడ
- రైతుల కోసం రాష్ట్రమంతా ధర్నాలు చేస్తమని ప్రకటన
- షాబాద్లో రైతు మహాధర్నాకు హాజరు
చేవెళ్ల, వెలుగు: వంద శాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తనతోపాటు బీఆర్ఎస్ నేతలమంతా రాజీనామా చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏదో ఉద్ధరించినట్టు ఢిల్లీలో గొప్పలు చెప్పుకున్నారని ఆయన విమర్శించారు. ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలయ్యాయని.. అందులో అర గ్యారంటీ మాత్రమే అమలైందని, అది కూడా ఫ్రీ బస్సు అని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని షాబాద్లో శుక్రవారం చేపట్టిన రైతు మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు.
“రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. ఏ ఊరికి అంటే ఆ ఊరికి పోదాం.. నువ్వు రాకపోతే నీ మంత్రులను పంపియ్.. ఎక్కడైనా రైతుల రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామాలు చేసి పోతం" అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. “నీ సొంతూరు కొండారెడ్డిపల్లెకు పోదాం.. కొడంగల్‌కు పోదాం.. అక్కడ వందశాతం రుణమాఫీ అయిందని చెప్తే రాజీనామానే కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా” అని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరానని, ఇంతవరకు చప్పుడు లేదని ఆయన దుయ్యబట్టారు. రైతు బంధు రూ. 15 వేలు ఇస్తానని ఎన్నికల్లో చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. అందుకే ధర్నా చేపట్టామని.. ఇది ప్రారంభం మాత్రమేనని, రాష్ట్రమంతా ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
37 రోజులు కాదు 370 రోజులు జైల్లో పెట్టుకో..
“37 రోజులు కాదు దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. భయపడెటోడు ఎవడూ లేడు" అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. “రాష్ట్రంలోని మహిళలకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్. కాంగ్రెసోళ్లను నమ్మకండి అనీ. నెలకు రూ. 2,500 పడ్డాయా..? 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలయ్యాయా?” అని ప్రశ్నించారు. “అబద్దాలు చెప్తున్న రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలి. కేసులు పెట్టినా పోలీసులు పిటిషన్ తీసుకోవడం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కార్యక్రమానికి వచ్చే ముందు కేటీఆర్‌పై 80 జేసీబీలతో పూలవర్షం కురిపించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నేతలు కార్తీక్ రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.