కేటీఎం 200 డ్యూక్​ న్యూ వర్షన్ లాంచ్​.. ధర ఎంతంటే?

కేటీఎం 200 డ్యూక్​ న్యూ వర్షన్ లాంచ్​.. ధర ఎంతంటే?

బైక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా కేటీఎం డ్యూక్​ 200 న్యూ వర్షన్ వచ్చేసింది. డ్యూక్ 200 (2022) అడ్వాన్స్డ్ వర్షన్ (2023)గా కేటీఎం ఇండియా దీన్ని లాంచ్​ చేసింది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 1.96లక్షలుగా నిర్ణయించారు. అంటే ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చితే ఇది రూ. 3,155 ఎక్కువ.

మునుపటి వర్షన్‌తో పోల్చి చూస్తే.. ఈ బైక్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. దాదాపు అవే ఫీచర్లు కొనసాగించారు. న్యూ వర్షన్‌కి కొత్తగా హెడ్ లాంప్ జోడించారు. ప్రస్తుతం డ్యూక్ 390 మోడల్‌లో ఈ హెడ్ లాంప్‌లను వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఆరంజ్, మెటాలిక్ సిల్వర్.. రెండు కలర్స్‌లో డ్యూక్ 200 అందుబాటులో ఉండనుంది.

6 స్పీడ్ గేర్ బాక్స్

ఇక ఈ బైక్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 10,000 ఆర్‌పీఎం వద్ద 24.68 బీహెచ్‌పీ పవర్ ను, అలాగే 8000 బీహెచ్‌పీ వద్ద 19.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్‌ను అమర్చారు. ఇక బ్రేకింగ్ విషయానికొస్తే.. ఇందులో 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 230 ఎంఎం రేర్ డిస్క్ అందించారు. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టం ఉంది. అయితే, ఇందులోఈ బైక్‌లో క్విక్ షిఫ్టర్ ఎంపిక అందుబాటులో లేదు. ఈ సదుపాయం కేటీఎం 390లో ఉంది. ఈ బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ, సుజుకీ జిక్సర్ 250 వంటి బైకులకు గట్టి పోటీ ఇవ్వనుంది.