పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ 7 రికార్డ్​

పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ 7 రికార్డ్​

పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)7వదశ కర్మాగారం విద్యుత్ ఉత్పత్తి లో జాతీయస్థాయిలో 3వ స్థానాన్ని సాధించింది. దేశంలోని 26 సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రాల్లో కేటీపీఎస్ 7వదశ 3వ స్థానంలో నిలవడం గమనార్హం. వీటిలో గుజరాత్ రాష్ట్రంలోని లారా కర్మాగారం మొదటి స్థానంలో నిలవగా, ఒడిశాలోని ధర్పల్లిలో ఉన్న ఎన్టీపీసీ 2వ స్థానంలో నిలిచింది. 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ కర్మాగారం2024-–25 వార్షిక సంవత్సరంలో 5538. 9876 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా 79. 04 శాతం పీఎల్ఎఫ్ నమోదు చేసుకుంది. 

గతేడాది కన్నా విద్యుత్ ఉత్పత్తి తగ్గినా 523.49 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ బ్యాక్  డౌన్ తీసుకోవడంతో గతేడాది రికార్డును ఛేదించినట్లయింది. దీంతోపాటు గతంలో ఉన్న 107 రోజు ల నిరంతర విద్యుత్ ఉత్పత్తి రికార్డును అధిగమించి 112 రోజులు సాధించిన కర్మాగారంగా ఇది గుర్తింపు పొందింది. గతంలో నిరంతరంగా పనిచేసిన సమయం కన్నా 96శాతం అధికంగా పని చేయడంతో మరో రికార్డ్ సొంతం చేసుకుంది. దీంతోపాటు ఆయిల్ వినియోగంలోనూ గత రికార్డును సంస్థ అధిగమించింది. జాతీయ స్థాయిలో రికార్డు సాధించడంలో కార్మికులు, ఇంజినీర్ల సమష్టి కృషి ఉందని కర్మాగారం చీఫ్ ఇంజినీర్ కె శ్రీనివాస బాబు తెలిపారు. 

5,6 దశల్లో తగ్గిన ఉత్పత్తి 

పాల్వంచలోని కొత్తగూడెం థర్మ ల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)5,6దశల్లో 2024 – 25 వార్షిక విద్యుత్ ఉత్పత్తిలో తగ్గుదల కనిపించింది. 1,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 3 యూనిట్లలో సరైన విద్యుత్ డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తి తగ్గింది. 2023-–24 సంవత్సరం లో కేటీపీఎస్ 5వ దశలోని 9వ యూనిట్ లో 1855. 50 మిలియన్ యూనిట్లు( 84. 49శాతం పీఎల్ఎఫ్ నమోదు), 10వ యూనిట్ లో 1632. 55 మి.యూ( 74.34శాతం పీఎల్ఎఫ్ నమోదు) విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 

రెండు యూనిట్లలో కలిపి 3,488. 05 మి.యూ(79.42శాతం పీఎల్ఎఫ్) ఉత్పత్తి అయింది.  ఈ ఏడాది 5వ దశలోని 9వ యూనిట్ లో 1,605.09 మి. యూనిట్లు( 73.29 శాతం పీఎల్ఎఫ్ మాత్రమే నమోదు)  విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అంటే సుమారు 200 మి. యూ విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. 10 యూనిట్ లో 1,280. 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగగా 58.47శాతం పీఎల్ఎఫ్ మాత్రమే నమోదైంది. 

 ఇక్కడ సుమారు 400 మిలియన్​ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. రెండు యూనిట్లలో కలిపి 3488.05 మిలియ న్ యూనిట్లకు గాను 2,885.67 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే నమోదైంది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 65. 8శాతం మాత్రమే నమోదైంది. ఇక కర్మాగారంలోని 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 6వ దశ లో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 3340.30 మిలియన్ యూని ట్ల విద్యుత్ ఉత్పత్తి, 76. 05శాతం పీఎల్ఎఫ్ నమోదు కాగా, ఈ ఏడాది 3054.68 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి, 69.74శాతం మాత్ర మే  పీఎల్ఎఫ్ నమోదు అయ్యింది. 

గడచిన సంవత్సరంలో అధికంగా కర్మాగారం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం, ఉత్పత్తి తగ్గించి నడపటం లాంటి కారణాలతో  రికార్డులు నమోదు కాలేదు. ఈ విషయమై కర్మాగార చీఫ్ ఇంజినీర్ ఎం.ప్రభాకర్ రావును వివరణ కోరగా గతేడాది విద్యుత్ ఉత్పత్తి మెరుగ్గానే జరిగినా బ్యాక్ డౌన్ల కారణంగా రికార్డు నమోదు కాలేదని, అయితే ప్రభుత్వం అవైలబిలిటీలను లెక్కించడం మూలంగా సంస్థ కు నష్టం లేదన్నారు.