థర్మల్​ కేంద్రాలకు బొగ్గు కష్టాలు

  •     కేటీపీఎస్, బీటీపీఎస్​లో తగ్గుతున్న నిల్వలు
  •     21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి
  •     ప్రస్తుతం 10 రోజులకు సరిపడా మాత్రమే ఉన్న బొగ్గు 
  •     అధికారులు అలర్ట్​ కాకుంటే కరెంట్​ తిప్పలు తప్పేలా లేదు.. 

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 35డిగ్రీలు నుంచి 37 డిగ్రీలు దాటుతుండడంతో కరెంట్​కు ఫుల్​ డిమాండ్​ పెరిగింది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలోని కేటీపీఎస్, మణుగూరులోని భద్రాద్రి థర్మల్​పవర్ స్టేషన్ల (బీటీపీఎస్) కు బొగ్గు కొరత ఏర్పడుతోంది. సాధారణంగా థర్మల్​ విద్యుత్​ కేంద్రాల్లో 21 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం విద్యుత్​ థర్మల్​ కేంద్రాల్లో 10 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. 

ఇదీ పరిస్థితి.. 

పాల్వంచలోని కేటీపీఎస్ 5,6 దశల్లో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది . ఈ రెండు కర్మాగారాల్లో కలిపి రోజుకు 10వేల టన్నుల బొగ్గు ను వినియోగిస్తారు. గతేడాది ఇదే సీజన్​లో మూడు లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా.. ఈ ఏడాది కేవలం లక్షా 30 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. కేటీపీఎస్ 5వ దశలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికిగానూ జీ10 గ్రేడ్ బొగ్గు రోజుకు 6వేల టన్నులను వినియోగిస్తున్నారు. 

మరో 500 మెగావాట్ల  విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 6వ దశలోని సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్​లో రోజుకు 6వేల టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. సింగరేణి నుంచి వచ్చే బొగ్గు నాణ్యత లోపించడం మూలంగా 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన యూనిట్లు 800 మెగావాట్ల వరకే పరిమితం అవుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. సింగరేణి కాలరీస్​ మణుగూరు ఏరియా, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ నుంచి రోజుకు12 వేల టన్నుల బొగ్గును జెన్కో దిగుమతి చేసుకుంటోంది. 

కాగా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ ఏడో దశలో దాదాపు 2లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం 80వేల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మణుగూరు, రుద్రంపూర్, రామగుండం  గనుల నుంచి జెన్కో బొగ్గును దిగుమతి చేసుకుంటోంది. రోజుకు పదివేల మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతి అవుతోంది. 800 మెగావాట్ల విద్యు త్ ఉత్పత్తి గాను రోజుకు ఈ కర్మాగారంలో 9వేల మెట్రిక్ టన్నుల  బొగ్గును వినియోగిస్తుంటారు. జీ13 గ్రేడ్ బొగ్గును ఈ కర్మాగారంలో వినియోగిస్తున్నారు. సింగరేణిలోని మణుగూరు, రుద్రంపూర్, రామగుండం ప్రాంతాల నుంచి రోజుకు రెండు నుంచి మూడు ర్యాకుల బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. 

ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం.. 

ఈ విషయమై కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజినీర్ మేక ప్రభాకర్ రావు మాట్లాడుతూ పది రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేటీపీఎస్ 7వ దశ డీఈ ఎస్ ఎన్ ఎస్ శేఖర్ మాట్లాడుతూ కర్మాగారంలో నిబంధనల మేరకే బొగ్గును వినియోగిస్తున్నామని వివరించారు. థర్మల్​విద్యుత్​ సంస్థలకు సరిపడా బొగ్గును ఎప్పటికప్పుడు తాము సప్లయ్​ చేస్తున్నామని సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు. క్వాలిటీతో కూడిన బొగ్గును సప్లయ్​ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు.